Mirchi Farmers Problems at Guntur Mirchi Yard : చెమటోడ్చి కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. గుంటూరు మిర్చి యార్డులో కొత్త సీజన్ ప్రారంభం కావటంతో రోజుకు లక్ష బస్తాలకు పైగా సరకు వస్తోంది. పెద్ద ఎత్తున మిర్చి విక్రయానికి తరలిరావటం, గోదాముల్లో పాత పంట పేరుకుపోవటం, అంతర్జాతీయంగా తగ్గిన ఎగుమతులు కారణాలతో ఆశించిన మేర ధర రాకపోవటం అన్నదాతల్ని కుంగదీస్తోంది.
గుంటూరు మిర్చి యార్డుకు సరకు విక్రయించేందుకు వస్తోన్న రైతన్నల ఎంతగానో వేదన చెందుతున్నారు. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో తొలి కోతలు పూర్తయిన పంటను మిర్చి యార్డుకు తెస్తున్నారు. సాధారణంగా కొత్త సరకు వచ్చే సమయానికి గతేడాది మిర్చి క్లియర్ అయ్యేది. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి ఉంది. 2024 మొదట్లో మిర్చి ధరలు క్వింటా 20వేల మేర ధర పలకటంతో రైతులు పెట్టుబడి అవసరాలకు కొంత సరకు అమ్ముకుని ధరలు మరింత పెరుగుతాయని శీతల గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. అప్పటి నుంచి ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో 30 లక్షల బస్తాలకు పైగా సరుకు శీతల గోదాముల్లో మిగిలిపోయింది. ఇప్పుడు కొత్త పంట కూడా వచ్చి చేరింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.
మిర్చి ధరలు తగ్గుదలపై రైతుల్లో ఆందోళన నెలకొంది. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరావటం లేదని కర్షకులను ఆవేదనకు గురిచేస్తోంది. ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడం దేశీయంగానూ డిమాండ్ తగ్గటం పాత సరకు నాణ్యత తగ్గడం, కొత్త పంట మార్కెట్కు వస్తుండటంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
రైతులను నిలువునా దోచేసిన వైఎస్సార్సీపీ నేతలు - రూ.350 కోట్లకు గండి
మిర్చియార్డుకు లక్షకు పైగా బస్తాలు రాగా అదే స్థాయిలో విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మిర్చి సీజన్ ప్రారంభమయ్యాక వరుసగా రెండు రోజుల పాటు లక్షకు పైగా బస్తాలు రావడం ఇదే ప్రథమం. రైతులు సోమవారం 1,12,021 బస్తాలు యార్డుకు తరలించారు. అందులో 1,02,511 బస్తాలు అమ్ముడయ్యాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 65,498 బస్తాలు నిల్వ ఉన్నాయి. మంగళవారం యార్డుకు 1,20,808 బస్తాలు రాగా, అందులో 1,15,612 బస్తాలను విక్రయించారు. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 70,694 బస్తాలు నిల్వ ఉన్నాయి. రెండు రోజుల్లో మొత్తంగా 2,18,123 బస్తాల విక్రయాలు జరిగాయి.