పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం ఒడిశాలోని పారాదదీప్ కు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలియజేసింది. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదులుతోందని ఐఎండీ వెల్లడించింది. గడచిన మూడు నాలుగు గంటలుగా ఉత్తర ఈశాన్య దిశగా 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని స్పష్టం చేసింది.
రాగల 24 గంటల్లో ఇది మరింత ఉద్ధృతమై తీవ్రవాయుగుండంగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ నెల 23న మధ్యాహ్నానికి సుందర్ బన్స్ వద్ద ఇది తీరాన్ని దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల వ్యవధిలో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఒడిశా, పశ్చిమ బంగా తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది . వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారినందున ఉత్తరకోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశా, పశ్చిమ బంగా తీరప్రాంతాల్లోని మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇదీ చదవండి: 'భూముల రీసర్వే.. ప్రతీ కమతానికీ ప్రత్యేక గుర్తింపు నెంబర్'