టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధును హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఘనంగా సన్మానించారు. కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్, అదనపు డీఐజీలు శిఖా గోయల్, అనిల్ కుమార్ తదితర ఉన్నతాధికారులు కరతాళ ధ్వనులు చేస్తూ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా 'ద సెకండ్ వేవ్' పుస్తకాన్ని సింధు ఆవిష్కరించారు. రెండో విడత లాక్డౌన్ సందర్భంగా నిర్వహించిన విధులకు సంబంధించిన వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సింధును పుష్పగుచ్ఛం అందించి సీపీ అంజనీకుమార్ ఆహ్వానించారు.
లాక్డౌన్ సమయంలో పోలీసులు ఎంతో కష్టపడి పని చేశారని పీవీ సింధు కొనియాడారు. ప్రాక్టీస్ కోసం స్టేడియానికి వెళ్లడానికి ఎంతో సహకరించారని.. పాస్ జారీ చేసి తనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వ క్రీడల్లో తాను గెలిచిన కాంస్య పతకాన్ని పోలీసుల సేవకు అంకితం చేస్తున్నానని స్పష్టం చేశారు.
బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్ర..
గత ఐదేళ్లుగా బ్యాడ్మింటన్ క్రీడపై పీవీ సింధు తనదైన ముద్ర వేశారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రశంసించారు. ఫిట్నెస్ను కాపాడుకుంటూ.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిందన్నారు. ఇది పీవీ సింధు ప్రతిభకు నిదర్శనమని అంజనీకుమార్ కొనియాడారు. కార్యక్రమంలో సింధు తండ్రి రమణ, కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల పోలీసులు పాల్గొన్నారు.
రూ.30 లక్షల నగదు బహుమతి..
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు.. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సచివాలయానికి వచ్చిన సింధును.. ఆ రాష్ట్ర సీఎం జగన్, మంత్రులు అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రూ.30 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ఆమెకు అందించారు.
ఇదీ చదవండీ.. VIRAL FEVERS: తండాలో విషజ్వరాలు.. ఆందోళనలో గ్రామస్థులు