తనఖాలో ఉన్న భూమిని ప్రభుత్వానికి విక్రయించిన ఉదంతంపై గుంటూరు జిల్లా అమరావతి పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి మండల పరిధిలోని ధరణికోట శివారు ముత్తాయిపాలెం గ్రామానికి చెందిన మోదేపల్లి శ్రీనివాసరావు, అచ్యుతరావుకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపై గుంటూరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖాలో ఉంచి కోటి రూపాయల రుణం తీసుకున్నారు. సదరు వ్యక్తులు రుణం తీర్చకుండానే.. సంబంధిత భూమిని పేదల ఇళ్ల స్థలాల పథకం కింద విక్రయించారు. ఎకరం రూ.55 లక్షల చొప్పున మూడు ఎకరాలను ప్రభుత్వం తరఫున అధికారులు కొనుగోలు చేశారు.
బ్యాంకులో రుణం ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం నడిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకు ఖాతాలను మార్చి దాదాపు కోటి రూపాయలను డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై.. బ్యాంకు మేనేజర్ తాడికొండ అరుణ అమరావతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందన్న సమాచారంతో... గోప్యంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: