YCP Gadapa Gadapaku program: అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం సీతయ్యపేటలో పలు సమస్యలపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని నిలదీశారు. 'మా కాలనీ ఎలా ఉందో చూడండి.. కనీసం ఒక్క కాలువ అయినా లేదు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు లేవు. ఒక్కటే కొళాయి. అందులో కూడా సరిగా నీళ్లు రావు' అని స్వరూపారాణి, అర్జునమ్మ, శింబోతు గుణశ్రీ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అందలేదని పలువురు వాపోయారు.
ప్రశ్నించకుండా అడ్డుకున్న నాయకులు: ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని 1వ వార్డు, ఇందిరా కాలనీల్లో పర్యటించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌లను నిలదీసేందుకు ప్రయత్నించిన పలువురిని స్థానిక నేతలు అడ్డుకున్నారు. నీటి ట్యాంకర్లు రావడం లేదని, రూ.500 పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుందని ఇందిరాకాలనీకి మొదటిలైన్‌కు చెందిన మాబూ అనే మహిళ వాపోయారు. ఎమ్మెల్యేకి సమస్యను తెలియజేసేందుకు వస్తుండగా వైకాపా నేతలు అడ్డుకొని ఇంట్లోకి పంపించేశారు. మురుగు సమస్యను చెప్పేందుకు ప్రయత్నించిన మరో మహిళనూ ఇంట్లోకి పంపి గొళ్లెం వేశారు.
* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం చిట్టవరం గ్రామంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు వద్ద ప్రజలు సమస్యలు ఏకరవు పెట్టారు. ఇంటి బిల్లులు సకాలంలో అందడం లేదని, వృద్ధాప్య పింఛను నిలిపేశారని పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పేదరికంలో ఉన్న తనకు ఇంటి స్థలం ఇవ్వలేదని నేతల శాంతరాజు ఆవేదన వ్యక్తంచేశారు.
ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేమీ లేదు: వైకాపా ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేమీ లేదని దళిత సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని బుక్కరాయసముద్రంలో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు దళిత సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు.
* తమ గ్రామానికి వైకాపా నేతలు ఏం చేశారని సత్యవేడు నియోజకవర్గంలోని కన్నావరం గ్రామానికి చెందిన మహిళ పలు సమస్యలపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను నిలదీశారు. మరికొంత మంది ఆమెతో జతకలసి మాట్లాడారు. దీంతో ఎమ్మెల్యే అసహనానికి లోనై తమిళంలో ‘‘ఒన్నుం పేసాదింగో’’ (ఏం మాట్లాడొద్దు) అంటూ గ్రామస్థులను హెచ్చరించారు. కొన్ని వీధులకే ఎమ్మెల్యే పర్యటన పరిమితం కావడంతో మిగిలిన ప్రాంతాలవారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సెల్‌ఫోన్ వెలుగులో సందర్శన: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శుక్రవారం సాయంత్రం పలు కాలనీల్లో పర్యటించారు. వీధి దీపాలు వెలగడం లేదని, తాగునీటి సరఫరా సరిగా లేదంటూ విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదంటూ గంగవరం ధారకొండ కాలనీ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పర్యటన సమయంలోనూ వీధుల్లో దీపాలు వెలగకపోవడంతో... సెల్‌ఫోన్ లైట్ వెలుగుల్లో కార్యక్రమం కొనసాగింది. ఆ వెలుగుల్లోనే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
ఇప్పటివరకు టిడ్కో ఇల్లు ఇవ్వలేదు: గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇల్లు మంజూరు చేస్తే అప్పు చేసి రూ.50 వేలు కట్టాం. ఇప్పటి వరకు మాకు ఇల్లు ఇవ్వలేదు. వడ్డీలు కట్ట లేక, అద్దె చెల్లించలేక అల్లాడి పోతున్నాం. ఈ మూడేళ్ల కాలంలో జగన్ మాకేం చేశారు అంటూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును 46వ డివిజన్‌కు చెందిన షేక్ మున్నీ అనే మహిళ ప్రశ్నించింది. తాగునీటి కుళాయిల్లో ధార సన్నగా వస్తుందని, కొన్ని ప్రాంతాల్లో సరఫరా సక్రమంగా ఉండటం లేదని స్థానికులు వాపోయారు.ఇంటి స్థలం, ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, కాలువల సమస్యలను పలువరు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఇవీ చదవండి: