Protestor's helped the ambulance to cross the road: జాతీయ రహదారి మధ్యన ఉండే డివైడర్ పైనుంచి ద్విచక్ర వాహనాన్ని దాటించడమే కష్టం. అలాంటిది ఒక మినీ అంబులెన్స్‌ను దాటించారు. ఈ ఘటన శుక్రవారం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా భోరజ్ చెక్‌పోస్టు వద్ద జరిగింది. మండలం పరిధిలోని జాతీయ రహదారిపై గత కొన్ని రోజులుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ఘటనల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రమాదాల దృష్ట్యా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికులంతా పెద్దఎత్తున తరలివచ్చి జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
అదే సమయంలో మహారాష్ట్ర నుంచి అటుగా వచ్చిన ఓ అంబులెన్స్.. వాహనాల మధ్య ఇరుక్కుపోయింది. ఇది గమనించిన ఆందోళనకారులు.. కళ్ల ముందే ఓ ప్రాణి ఇబ్బంది పడుతుండగా చూడలేకపోయారు. అంబులెన్స్‌కు దారిచ్చేందుకు యత్నించారు. ట్రాఫిక్ జామ్‌లో ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో సమీపంలోని ఇనుప గ్రిల్స్‌ను అక్కడకు తరలించారు. డివైడర్‌పైకి అమర్చారు. అంతా ఒక్కటై చేతులతో వాహనాన్ని ఎత్తుకుంటూ డివైడర్‌ను దాటించారు. అంబులెన్స్‌ను ఆస్పత్రికి పంపించి శభాష్ అనిపించుకున్నారు. జైనథ్ మండలం వాసులు చూపిన చొరవకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: కన్నతండ్రిపై కుమారుడి కర్కశత్వం.. ఆస్తి విషయమై విచక్షణారహిత దాడి !