విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు అరెస్టులకు దారి తీశాయి. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేయడాన్ని తప్పుబడుతూ.. జీవీఎంసీ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో..
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని వీఎస్‌పీ లైమ్ స్టోన్ మైన్స్ కార్మిక సంఘాలు చేసే ఆందోళనను ఉద్ధృతం చేశాయి. తాజాగా వెలువడిన కేంద్ర ప్రకటనతో ఆగ్రహించిన కార్మిక నాయకులు.. ప్లాంటు మార్గంలో బైఠాయించి వాహనాలను నిలిపి వేశారు. కేంద్రం దిగి రాకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను విక్రయించవద్దు..
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని వామపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. స్టీల్ ప్లాంట్ను విక్రయించవద్దని ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ సంస్థలు ఆలూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే నిరసనలు ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ కార్యదర్శి ఎన్వీ నాయుడు హెచ్చరించారు.