Power production Problems: వేసవిలో తలెత్తే అదనపు విద్యుత్ డిమాండ్ సర్దుబాటుకు సరైన ప్రణాళిక లేకపోవడం.. ముందుచూపు కొరవడటంతో పరిశ్రమలు, ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి బొగ్గు లేదు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనడానికి డబ్బులు లేవు. వెరసి సుమారు దశాబ్ద కాలం తర్వాత పరిశ్రమలకు విద్యుత్ విరామాన్ని(పవర్ హాలిడే) ప్రకటించాల్సి వచ్చింది. జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్‌తో (పీఎల్‌ఎఫ్) పనిచేసినా సమస్య ఉండేది కాదు. నిర్మాణం పూర్తయిన కృష్ణపట్నం 800 మెగావాట్ల ప్లాంటు నుంచి ఉత్పత్తి తీసుకున్నా ఇబ్బంది తలెత్తేది కాదు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే కోతలు విధించే పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర విద్యుత్ డిమాండ్.. వినియోగానికి మధ్య ఉన్న 1000 మెగావాట్ల కొరతను అధిగమించడం డిస్కంలకు సాధ్యంకావటం లేదు.
ప్రణాళికా లోపం.. సుస్పష్టం
జెన్‌కో, హిందూజా థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పాదక సామర్థ్యం 6,050 మెగావాట్లుగా కాగా.. వాటి నుంచి ఉత్పత్తి 3,750 మెగావాట్లు దాటడం లేదు. వాటిని 85-90 పీఎల్‌ఎఫ్‌తో నిర్వహిస్తే 5,445 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కానీ థర్మల్ ప్లాంట్లను పూర్తి పీఎల్‌ఎఫ్‌తో పని చేయించడానికి బొగ్గు నిల్వలు లేక 60శాతం లోడ్‌లో నిర్వహించాల్సి వస్తోంది. వీటీపీఎస్, ఆర్‌టీపీపీ, కృష్ణపట్నం దగ్గర సుమారు 1.93 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. పూర్తి పీఎల్‌ఎఫ్ వచ్చేలా ఉత్పత్తిలో ఉంచితే తర్వాత రోజు బొగ్గు అందకుంటే షట్‌డౌన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మరింతగా నష్టపోవాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో బ్యాక్‌డౌన్‌లో నిర్వహించాల్సి వస్తోంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం.
కృష్ణపట్నంలో రెండు థర్మల్ యూనిట్ల నుంచి 1,600 మెగావాట్ల ఉత్పత్తి రావాలి. కానీ, 800-850 మెగావాట్లకు మించడం లేదు. ఈ ప్లాంటును 30శాతం విదేశీ బొగ్గు, 70శాతం దేశీయ బొగ్గును కలిపి వినియోగించేలా రూపొందించారు. మూడేళ్లుగా విదేశీ బొగ్గును సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో స్థానికంగా అందుబాటులో ఉన్న బొగ్గునే వాడటం వల్ల ఉత్పత్తి సగానికి పడిపోయింది. మూడో యూనిట్‌ను పూర్తిగా దేశీయంగా లభించే బొగ్గు వినియోగించేలా రూపొందించారు. ఇది 2019 ఆఖరుకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. కానీ కొవిడ్, ఇతర కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. చివరకు గత ఏడాది జులై-ఆగస్టు నాటికే నిర్మాణం పూర్తయినా కమర్షియల్ ఆపరేషన్ డేట్(సీవోడీ)కు డిస్కంలు అనుమతించడం లేదు. దీని నుంచి వచ్చే విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.50 వంతున కొనాల్సి వస్తుందని.. మార్కెట్‌లో యూనిట్ రూ.3.50కే దొరుకుతుందని చెబుతూ పీపీఏకు నిరాకరిస్తున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్‌కు సగటున రూ.8.11 వంతున విద్యుత్ కొంటున్నాయి.
వైన్ షాపులు సర్కారుకు..
విద్యుత్తు ప్లాంట్లు ప్రైవేటుకా!
కృష్ణపట్నం ప్లాంటుకు అవసరమైన బొగ్గు నిల్వలను సమకూర్చడం ప్రభుత్వానికి చేతకాకపోగా.. ప్లాంట్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దేశంలోనే అత్యంత పీఎల్‌ఎఫ్‌తో థర్మల్ ప్లాంట్లను నిర్వహించిన చరిత్ర ఏపీ జెన్‌కోది. వీటీపీఎస్, కేటీపీఎస్ (కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం), ఆర్‌టీపీపీతో పాటు పలు ప్లాంట్ల నుంచి పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జెన్‌కో తీసుకొచ్చింది. అలాంటి జెన్‌కో పరిధిలోని కృష్ణపట్నం (ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు ప్లాంట్లు కలిపి 2,400 మెగావాట్లు) నిర్వహణను 25 ఏళ్ల పాటు ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు కార్పొరేషన్‌గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంతో పాటు.. ప్రైవేటు లైసెన్సీల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వమే సొంతంగా నిర్వహించడానికి లాక్కుంది. రాష్ట్ర విద్యుత్ రంగానికి గుండెలాంటి కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మాత్రం ఎంతో అనుభవం ఉన్న జెన్‌కో చేతుల్లోంచి తీసుకెళ్లి ప్రైవేటుకు అప్పగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంది.
విద్యుత్ డిమాండ్ అంచనాల్లో 22శాతం (55 మిలియన్ యూనిట్లు) ఎక్స్ఛేంజీల నుంచి కొనాల్సి వస్తోంది. దీనికోసం ఉత్పత్తి సంస్థలతో స్వల్పకాలిక పీపీఏలు కుదుర్చుకున్నా ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణలో గ్రిడ్ డిమాండ్ (14,582 మెగావాట్లు) ఉన్నా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నప్పుడు.. రాష్ట్రంలో 11,500 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయడం ఎందుకు సాధ్యంకావటం లేదనేది అంతుబట్టని ప్రశ్న.
ఇదీ చదవండి: వాటిలో నాణ్యత తప్పనిసరి.. లేదంటే తీవ్ర చర్యలు: సీఎం జగన్