తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ చిరుతిండ్లు అమ్మకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాను నడిపిస్తున్న ఆ బండికి నిరుద్యోగి అని పేరు పెట్టి.. తన విద్యార్హతలను కూడా దానిపై రాశారాయన. ఇది చూపరులను ఆలోచింపచేస్తోంది.
బడి నుంచి బండికి..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన మట్టెల సంపత్.. ఎంఎస్సీ, బీఈడీ, బీఎల్‌ఐఎస్సీ పూర్తి చేశారు. గతంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఓ ప్రైవేట్ స్కూల్‌ని నడిపించాడు. తనతో పాటు మరో పదిహేను మందికి ఉపాధిని కల్పించాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, కరోనా మహమ్మారితో గత ఏడాది నుంచి పాఠశాలలు మూసివేశారు. ఈ పరిస్థితుల్లో చేతిలో పైసలు లేక.. చేసేందుకు పనులు లేక.. ఉపాధి కోసం అన్వేషించాడు.
అలవాటులో నుంచి..
చదువుకునే సమయంలో స్వతహగా చిరుతిండ్లు తయారు చేసుకునే వాడు. ఆ అలవాటులోంచే ఓ ఆలోచన పుట్టింది. అనుకున్నదే తడవుగా కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పక్కన మిర్చీ బండిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే ప్రస్తుతం అతనికి ఉపాధిగా మారింది. బండికి ఇరువైపుల నిరుద్యోగి అని రాసి.. తన విద్యార్హతలను రాశాడు. ఇది స్థానికులను ఆలోచింప చేస్తోంది. తనలా ఎందరో నిరుద్యోగులు దుర్భర జీవితాలను గడుపుతున్నారని బాధితుడు సంపత్ తెలిపాడు. తమ లాంటి ఎంతో మందిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
ఇదీ చదవండి: