ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థను (ఆర్‌డీసీ) ఆర్థికంగా బలోపేతం చేసి, రోడ్ల పనులు చేపట్టాలని ప్రభుత్వం భావించారు. ఇందుకోసం సెప్టెంబరు 18 నుంచి పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూపాయి చొప్పున రహదారి అభివృద్ధి పన్ను విధించారు. దీని ద్వారా నెలకు రూ.50 కోట్ల చొప్పున, ఏటా రూ.600 కోట్ల మేర సమకూరుతుందని అంచనా. ఈ నిధులను రహదారుల మరమ్మతులు, అభివృద్ధి పనులకు వెచ్చిస్తే తమ శాఖకు కొంతవరకు నిధుల కొరత తీరుతుందని ఇంజినీర్లు సైతం భావించారు. అయితే రుణ బకాయిల మెలికతో ఈ నిధులు బ్యాంకులకు జమచేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఆర్‌డీసీ రూ.3వేల కోట్ల మేర బ్యాంకు రుణం తీసుకోగా, దీనికి ప్రతి నెలా రూ.20 కోట్ల చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు.
ఈనెల నుంచి వడ్డీతోపాటు అసలులో రూ.20 కోట్లు కలిపి.. మొత్తం రూ.40 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. అంటే రహదారి అభివృద్ధి పన్ను కింద నెలకు వచ్చే రూ.50 కోట్లలో, రూ.40 కోట్ల వరకు బ్యాంకు రుణాలకే సరిపోతుంది. మిగిలే రూ.10 కోట్లు రహదారుల పనులకు ఏ మూలకూ సరిపోవని పేర్కొంటున్నారు. అందుకే ఈ రుణ వాయిదాలు, వడ్డీలకు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం నుంచే చెల్లింపులు చేయాలని, రహదారి అభివృద్ధి పన్ను కింద వచ్చే నిధులతో మెలిక పెట్టొద్దని ఆర్థికశాఖను, రహదారులు భవనాలశాఖ కోరుతోంది.
ఇదీ చదవండి: