Garbage tax: చెత్తపన్నుపై ప్రజల నుంచే కాదు వైకాపా ప్రజాప్రతినిధుల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం సొంత జిల్లాలోని కడప నగరపాలక సంస్థ పాలకవర్గంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం చెత్తపన్నును ఆపి వేయాలని అధికారులకు సూచించారు. విశాఖ నగర ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆస్తి పన్ను శ్లాబ్ల ఆధారంగా చెత్తపన్ను విధించాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది.
రాష్ట్రంలోని 40 పుర, నగరపాలక సంస్థల్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని దశల వారీగా 124 నగరాలు, పట్టణాలకు విస్తరిస్తారు. క్లాప్ అమలులో ఉన్నచోట ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. ఇందుకోసం పట్టణ స్థానిక సంస్థలకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ సంస్థ 2,182 వాహనాలను పంపింది. వీటిలో దాదాపు 2,134 వినియోగంలో ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో వీటిని సమకూర్చారు.
ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను తరలించేందుకు వినియోగిస్తున్న ఒక్కో వాహనానికి నెలకు 63 వేల చొప్పున పుర, నగరపాలక సంస్థలు అద్దె చెల్లించాలి. ఇందుకు 13.74 కోట్లను తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రజల నుంచి వసూలు చేసే వినియోగ రుసుముల నుంచి ఈ మొత్తాలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి కమిషనర్లకు ఆదేశాలున్నాయి. మూల ధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించాక.... ఏటా 15% చొప్పున గత రెండేళ్లుగా పెంచుతున్నారు.
పెరిగిన ఆస్తి పన్ను మొత్తానికి సమానమయ్యే వరకు ఏటా 15% చొప్పున పెంపు ఉంటుంది. భూముల విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పెంచినప్పుడల్లా మళ్లీ ఆస్తి పన్ను పెరగనుంది. ఈ పరిస్థితుల్లో చెత్త పన్నుపైనా ఒత్తిడి చేయడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సచివాలయాల సిబ్బందిని నిల దీస్తున్నారు. అత్యధిక జిల్లాల్లో చెత్త పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.
ఇవీ చదవండి: