Prepaid meters: వాడిన విద్యుత్తుకు తర్వాత నెలలో ఇప్పటివరకు వినియోగదారులు బిల్లు చెల్లిస్తున్నారు. చెల్లింపులో ఆలస్యమైనా స్వల్పంగా జరిమానా పడుతుందే తప్ప వెంటనే సరఫరా నిలిచిపోదు. కనీసం రెండు నెలలపాటు అవకాశమిస్తారు. ఇక మీదట అలా కుదరదు. విద్యుత్తు కావాలంటే ముందుగా డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సిందే. అది ఖర్చయ్యేలోగా మళ్లీ డబ్బు కడితేనే సరఫరా కొనసాగుతుంది. లేదంటే క్షణాల్లో నిలిచిపోతుంది. సెల్‌ఫోన్ల మాదిరే విద్యుత్ సరఫరా కోసం ముందస్తుగా రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఏర్పడనుంది. రాష్ట్రంలో వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు (ముందస్తు చెల్లింపు మీటర్లు) బిగించాలని ప్రభుత్వం నిర్ణయించడమే దీనికి కారణం. వాటి ఏర్పాటు, నిర్వహణ కోసం వచ్చే పదేళ్లలో రూ.31,200 కోట్లను డిస్కంలు వెచ్చించనున్నాయి.
పంపిణీ రంగం పునరుద్ధరణ పథకం (రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం- ఆర్‌డీఎస్‌ఎస్) కింద డిసెంబరు 2025నాటికి అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయాలని కేంద్రం నిబంధన విధించింది. మొదటి దశలో గృహ, వాణిజ్య, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకు కలిపి 38.61 లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయాలని ఇంధన శాఖ నిర్ణయించింది. మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలవడానికి డిస్కంలు ప్రతిపాదనలు రూపొందించి న్యాయ సమీక్షకు పంపాయి. అక్కడినుంచి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో మొత్తం 1.5 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో వ్యవసాయ కనెక్షన్లు సుమారు 20 లక్షలు మినహాయిస్తే.. 1.3 కోట్ల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు రానున్నాయి.
మొదటి దశలో 38 లక్షలు: మొదటి విడతలో అమృత్ నగరాల పరిధిలోని అన్ని కేటగిరి కనెక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలకు తప్పనిసరిగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. వీటితోపాటు 200 యూనిట్ల వాడకం దాటిన గృహ విద్యుత్ కనెక్షన్లు, 300 యూనిట్ల వినియోగం దాటిన వాణిజ్య కనెక్షన్లు, ఎల్‌టీ పారిశ్రామిక కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు డిస్కంలు ప్రతిపాదనలు రూపొందించాయి. ఈ ప్రకారం మూడు డిస్కంల పరిధిలో 18.73 లక్షల గృహ, 15.48 లక్షల వాణిజ్య, 1.19 లక్షల పారిశ్రామిక, 3.21 లక్షల ప్రభుత్వ శాఖల కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు రానున్నాయి. ఇందుకోసం మూడు డిస్కంలు వేర్వేరుగా టెండరు ప్రకటనలనిస్తాయని ఒక అధికారి తెలిపారు. డిసెంబరునుంచి మీటర్ల ఏర్పాటు ప్రారంభించాలని భావిస్తున్నారు.
గ్రాంటు రూ.7 వేల కోట్లు.. డిస్కంలపై భారం రూ.24 వేల కోట్లు: మీటర్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతను పదేళ్లపాటు గుత్తేదారు సంస్థకు అప్పగించేలా టెండరు నిబంధనలను అధికారులు రూపొందించారు. ఇదే పథకం కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు మహారాష్ట్రలో నిర్వహించిన టెండర్లలో ఒక్కొక్క దానికి నెలకు రూ.200 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదిరిందని ఒక అధికారి తెలిపారు. దీని ప్రకారం పదేళ్లలో గుత్తేదారు సంస్థకు ఒక్కొక్క మీటర్‌కు రూ.24 వేలు చెల్లించాలి. రాష్ట్రంలో దాఖలయ్యే బిడ్లు కూడా అంతకంటే తక్కువ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
దీని ప్రకారం రెండు దశల్లో 1.30 కోట్ల విద్యుత్ కనెక్షన్లకు ఏర్పాటుచేసే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు నెలకు రూ.260 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,120 కోట్లు ఖర్చవుతుంది. పదేళ్లలో రూ.31,200 కోట్లు మీటర్ల నిర్వహణకు వెచ్చించాల్సి వస్తుంది. ఇందులో 15 శాతం కేంద్రం గ్రాంటు రూపేణా ఇస్తుంది. నిర్దేశిత వ్యవధిలో మీటర్లను బిగిస్తే అదనంగా 7.5 శాతం గ్రాంటు లభిస్తుంది. మొత్తంగా 22.5 శాతం కేంద్రం గ్రాంటు కింద అందితే.. రూ.7,020 కోట్లు పోను రూ.24,180 కోట్ల భారాన్ని పదేళ్లలో డిస్కంలు భరించాల్సి వస్తుంది.
ఇవీ చదవండి: