కరోనా వైరస్ మన శరీరంలోకి నోరు, ముక్కు, కళ్ల ద్వారా ప్రవేశిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే కరచాలనం, బయటికి వెళ్లినప్పుడు ఆయా ప్రదేశాలను-వస్తువులను తాకడం ద్వారా కూడా ఈ వైరస్ ప్రమాదం పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో, వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న విషయమూ విదితమే.
అందుకే పదే పదే హ్యాండ్‌వాష్, సబ్బు, శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నాం. అన్ని సందర్భాల్లో సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్‌వాష్‌తో చేతుల్ని కడుక్కోవడం కుదరకపోవచ్చు. అందుకే శానిటైజర్ వాడకం పెరిగిపోయింది. అయితే దీనిని ఎక్కువగా వాడడం వల్ల కొన్ని నష్టాలు కూడా పొంచి ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..
మహిళలూ జాగ్రత్త
శానిటైజర్లతో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గృహిణులు వంటింట్లో పనిచేసే క్రమంలో గ్యాస్ స్టౌ వెలిగించడం, పూజ చేసే సమయంలో దీపాలు వెలిగించడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో శానిటైజర్లను చేతులకు రాసుకున్న వెంటనే ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ సెగ తాకి చేతులు మండే అవకాశం ఉంది.
అంతేకాదు.. నిర్లక్ష్యంగా ఉంటే మంట చేతులకు అంటుకునే ప్రమాదమూ లేకపోలేదు. అయితే ఇందుకు కారణం శానిటైజర్లలో 60 నుంచి 90 శాతం ఆల్కహాల్ కలిసి ఉండడమే. సాధారణంగా ఆల్కహాల్‌కు మండే స్వభావం ఉంటుంది. కాబట్టి గృహిణులు చేతికి శానిటైజర్లు రాసుకున్న వెంటనే కాకుండా అది చేతుల్లోకి పూర్తిగా ఇంకిపోయి, ఆరిన తర్వాతే వంటింట్లో పనులు మొదలు పెట్టడం ఉత్తమం.
చిన్నారుల విషయంలోనూ...
చిన్న పిల్లలు శానిటైజర్లను ఉపయోగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నియంత్రణ మండలి (సీడీసీ) కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తోంది. పదేళ్ల లోపు చిన్నారులు శానిటైజర్లను వినియోగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది. ముఖ్యంగా నోట్లో వేలు పెట్టుకునే అలవాటున్న పిల్లల చేతులకు శానిటైజర్లు రాయకపోవడమే ఉత్తమం అంటున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు దీనిని మింగకుండా జాగ్రత్త పడాలి.
మీరు వాడే శానిటైజర్ మంచిదేనా? ఇలా చెక్ చేసుకోండి..!
కరోనా భయంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ శానిటైజర్లను వాడుతున్నారు. ఇదే అదనుగా మార్కెట్లో ఎన్నో రకాల శానిటైజర్లు అందుబాటులోకొచ్చాయి. అయితే శానిటైజర్ కొనేముందు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే కరోనా వైరస్ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను కొన్ని సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. శానిటైజర్ల ఉత్పత్తిలో ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నాయి.
వాస్తవానికి వైరస్ బారి నుంచి కాపాడే శానిటైజర్‌ను ఇథైల్ (ఇథనాల్) ఆల్కహాల్‌తో తయారుచేయాల్సి ఉంటుంది. అయితే కొందరు చౌకగా వస్తుందని మిథైల్ (మిథనాల్) ఆల్కహాల్‌తో తయారుచేస్తున్నారు. ‘మిథైల్’ ఆధారిత శానిటైజర్ వాడితే చర్మ సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాల బారినపడే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో - మనం వాడే శానిటైజర్ అసలు మంచిదా కాదా ? ఎలా తెలుసుకోవాలి? రండి చూద్దాం...
వాడాల్సినవి: ఇథైల్ ఆల్కహాల్, ఐసో ప్రొపైల్ ఆల్కహాల్, ఎన్ ప్రొపైల్ ఆల్కహాల్ ఆధారితమైనవి.
వాడకూడనివి: మిథైల్ ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు.
- జిగురు (జెల్), నురుగు మాదిరి కంటే ద్రావణం మాదిరిగా ఉండే శానిటైజర్లతోనే ఎక్కువ ప్రయోజనం.
- చేతుల్లో వేసుకొని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకుని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి.
- శానిటైజర్లలో 60-90 శాతం వరకూ ఆల్కహాల్ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా, కొత్త సమస్యలొస్తాయి.
- కనీసం 20-30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి.
మిథైల్ ఆల్కహాల్ ఉన్న శానిటైజర్లు ఎందుకు వాడకూడదు?
- మిథనాల్‌తో తయారు చేసిన శానిటైజర్‌లో హానికారక పదార్థాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) హెచ్చరించింది.
- వీటిని వినియోగించడం వల్ల విషపూరిత పదార్థాలు శరీరంలోకి వెళ్లే అవకాశాలుంటాయి.
- వికారం, వాంతులు, తలనొప్పి, కళ్లు మసకబారడం, ఒక్కోసారి శాశ్వతంగా చూపు కోల్పోవడం, మూర్ఛ వంటి సమస్యలతో పాటు, కొన్ని సందర్భాల్లో కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.
- ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటాయి.
చూశారుగా... మనం వాడే శానిటైజర్ మంచిది కాకపోతే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో?
అందుకే- శానిటైజర్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు పేరున్న, విశ్వసనీయమైన సంస్థలు తయారు చేసిన శానిటైజర్లను కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వండి.
అలాగే అవకాశం ఉన్నంత వరకు సబ్బుతో కూడా తరచూ శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. అవకాశం లేని పరిస్థితుల్లో శానిటైజర్ల వాడకం ఎలాగూ తప్పదు. అలాంటి సందర్భాల్లో కూడా పైన చెప్పిన జాగ్రత్తలు పాటించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు.. 11 మంది మృతి