Condolence to Krishna Raju death: కృషంరాజు మృతి తీరని లోటని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీపీఐ నేత నారాయణ, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎంపీగా ఉభయగోదావరి జిల్లాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. నటుడిగా, రాజకీయ నేతగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.
కృష్ణంరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరమన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -జగన్, ముఖ్యమంత్రి
విలక్షణమైన నటనతో కృష్ణంరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా కేంద్రమంత్రిగా సేవలందించారు. కృష్ణంరాజుకు చరిత్రలో ఒక పేజీ ఉంది. రెబల్ స్టార్‌గా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. సినిమా పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన నెలకొల్పిన లెగసీ స్ఫూర్తిదాయకం. ప్రభాస్ ఉన్నత స్థానంలో ఉండాలని కృష్ణంరాజు ఆశించారు. -తెదేపా అధినేత చంద్రబాబు
"మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మృతి కలిచివేసింది. కృష్ణంరాజు మృతితో సినీపరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. కృష్ణంరాజు గొప్ప నటుడు, మానవతావాది, అజాత శత్రువు. నటుడిగా, నిర్మాతగా సినీపరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు." -ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు చెరగని ముద్ర వేశారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో రెబల్ స్టార్‌గా ఎదిగారు." -నారా లోకేశ్
"కృష్ణంరాజు మృతి బాధాకరం. ఎంపీగా ఉభయగోదావరి జిల్లాల అభివృద్ధికి కృష్ణంరాజు కృషి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది నాయకులకు కృష్ణంరాజు స్ఫూర్తిగా నిలిచారు." -మంతెన సత్యనారాయణ రాజు
ఇవీ చదవండి: