ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ వైద్యులు, పోలీసులు మాత్రం కుటుంబాలను సైతం మరిచి విధులు నిర్వహిస్తున్నారు. వైరస్ ఉన్న వారిని గుర్తించడం నుంచి ఆస్పత్రికి వచ్చిన వారికి చికిత్స అందించడం వరకు వైద్యులు అలుపెరగని కష్టం చేస్తున్నారు. పోలీసులు కూడా అత్యంత కఠిన పరిస్థితుల మధ్య తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు బయటకి రాకుండా చూడడం వారి ప్రధాన కర్తవ్యం.
ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకుండా రోడ్లపైకి వచ్చిన వారికి ఓపికగా పరిస్థితిని వివరించడం ఎంతో సవాలు కూడుకొన్నది. ప్రాణాలను లెక్క చేయకుండా కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లపై పహారా కాస్తున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నుంచి వారికి ప్రతిఘటనలు ఎదురైనా, సంయమనంతో ప్రజలకు నచ్చజెప్పి ఇళ్లకు పంపిస్తున్నారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణ, తమకు తోచిన విధంగా ఆహారాన్ని అందిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది పోలీసు సిబ్బంది నిత్యం ఈ విధుల్లోనే తీరిక లేకుండా ఉన్నారని ఉన్నతాధికారులు తెలిపారు. తగినంత స్థాయిలో రక్షణ లేకపోయినా బాధ్యతగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని... భవిష్యత్తులోనూ 'ప్రజలే ముందు' అనే నినాదంతో నిర్వహిస్తూనే ఉంటారని చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'లాక్‌డౌన్ ఉల్లంఘనల వల్లే కరోనా కేసుల వృద్ధి'