పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాంను ఇంకా సురక్షిత స్థాయికి నిర్మించకపోవడం, అప్రోచ్ ఛానల్ తవ్వకం పూర్తిచేయకపోవడంపై అధికారులను పోలవరం అథారిటీ నిలదీసింది. కాఫర్ డ్యాం పనులు ఎప్పటికి పూర్తిచేస్తారని ప్రశ్నించింది. అప్రోచ్ ఛానల్ పనులు సగం కూడా పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేసింది. మే నెలాఖరుకు పూర్తిచేయాల్సి ఉన్న పనులపై చర్చించింది. గోదావరిలో వరద వచ్చేలోపు పోలవరం ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనుల పురోగతిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అధికారులు, ఇతర కేంద్రసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, మేఘా ఇంజినీరింగు సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాఫర్ డ్యాం పనులు ఎప్పటికి పూర్తిచేస్తారని చంద్రశేఖర్ అయ్యర్ అధికారులను ప్రశ్నించారు. దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించకపోవడాన్ని తప్పుబట్టారు. వెంటనే ఈ పనులు చేపట్టాలన్నారు. గోదావరికి ఈ లోపు వరద వస్తే కాఫర్ డ్యాం మీదుగా నీరు ప్రవహించే ప్రమాదంపైనా ప్రస్తావించారు. డ్యాం నిర్మాణాన్ని ఎప్పటికి సురక్షిత స్థాయికి తీసుకొస్తారని అడిగారు. జూన్ నెలాఖరుకు 38 మీటర్ల ఎత్తుకు, జులై నెలాఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మిస్తామని అధికారులు చెప్పారు. ఈ లోపు వరద వస్తే ఏం చేస్తారని అయ్యర్ ప్రశ్నించినట్లు సమాచారం.
జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఎంత వరద వస్తుందో రికార్డుల ఆధారంగా అధికారులు వివరించే ప్రయత్నం చేయగా... ప్రకృతిని మనం అంచనా వేయలేమని, వరద సీజన్ ప్రారంభమయ్యాక ఏ క్షణమైనా వరద రావొచ్చని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనని చెప్పారు. ఇప్పటివరకూ వచ్చిన ఇబ్బందులు జూన్, జులైలలో రావని ఎలా చెప్పగలరని అధికారులను సీఈవో ప్రశ్నించారు. వరద వచ్చినా పనులు చేసుకునేందుకు వీలుగా ప్రణాళిక ఉందంటున్నా.. వర్షాలు, ఇతర సమస్యలు అడ్డం కాబోవంటూ ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. కరోనాతో ఎదురైన ఇబ్బందుల వల్లే అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయామని అధికారులు చెప్పారు.
గోదావరి నదిని మళ్లించేందుకు అప్రోచ్ ఛానల్ పనులు సగం కూడా పూర్తిచేయకపోవడంపై చంద్రశేఖర్ అయ్యర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్‌లో వచ్చే వరదకు తగ్గట్టుగా కొంతమేర మొదట తవ్వుతున్నామని, ఆ తర్వాత జులైలో అప్రోచ్ ఛానల్ తవ్వకంలో మిగిలిన పనులు చేస్తామని అధికారులు వివరించారు. స్పిల్ ఛానల్ కాంక్రీటు పనులూ పూర్తి చేయకపోవడంపై అధికారులు ప్రస్తావించారు. రాబోయే రెండు నెలల్లో ఏ పనులు ఎలా పూర్తి చేయాలనుకుంటున్నారో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసి పంపాలని అధికారులను సీఈవో ఆదేశించారు.
ఇదీ చదవండి: