మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో, గెజిట్లను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కొత్త విధానంతో ఆస్తి పన్ను విధించేందుకు వీలు కల్పిస్తూ గతేడాది నవంబర్ 24 న జారీచేసిన జీవో 198, అదే రోజున జారీ చేసిన గెజిట్ ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ ' అవగాహన సంస్థ ' కార్యదర్శి కె. శివరామిరెడ్డి, ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, మరికొందరు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పాత విధానంలోనే ఆస్తి పన్ను విధించేలా సర్కారును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇప్పటి వరకూ వార్షిక అద్దె విలువ ఆధారంగా ఇళ్లు, భవనాలకు పన్ను విధించేవారన్నారు. దీని స్థానంలో మూలధన విలువ ఆధారంగా మదింపు చేసి ఆస్తి పన్ను విధించేందుకు కొత్త పద్ధతిని తీసుకొచ్చారన్నారు. ఆస్తి పన్ను మదింపు పద్ధతిని మార్చడానికి ముందు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోలేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. సోమవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది.
ఇదీ చదవండి: