High Court on Amul Parlous: నామినేషన్ ఆధారంగా బహిరంగ టెండర్లు పిలవకుండా అమూల్ కంటెయినర్ బూత్‌ల ఏర్పాటుకు విజయవాడ నగరపాలక సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 9న చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. 23వ వార్డు కార్పొరేటర్ వెలిబండ్ల బాలస్వామి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిల్ కార్యదర్శి, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్(అమూల్) ఎండీని వ్యాఖ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.
కార్పొరేషన్ పరిధిలో మొత్తం 101 అమూల్ పార్లర్లు ఏర్పాటుకు తీర్మానం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే 45 పార్లర్ల ఏర్పాటుకు ప్రాంతాల్ని గుర్తించారన్నారు. రాయితీ కల్పిస్తూ మూడేళ్ల వరకు లీజుకు ఇచ్చారని.. ఆయా ప్రాంతల్లోని మార్కెట్ విలువలో 10 శాతం సొమ్ము చెల్లించేందుకు వీలు కల్పించారని తెలిపారు. బహిరంగ టెండర్లు పిలవకుండా ఈ విధంగా కేటాయించడం.. కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయానికి భారీగా గండి కొట్టడమే అవుతుందన్నారు. పాల ఉత్పత్తి, దాని అనుబంధ కార్యకలాపాల ద్వారా భారీ సొమ్ముతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమూల్‌కు ' ప్రత్యేక రాయితీ ' ఇన్వాల్సిన అవసరం ఏముందన్నారు. రాయితీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తీర్మానంలో పేర్కొనలేదన్నారు. ప్రజలకు బహిరంగ ప్రకటన ఇవ్వలేదని పిటిషన్లో తెలిపారు. అభ్యంతరాలు సేకరించలేదన్నారు.
లీజుకు ఇచ్చే విషయంలో ఏపీ మున్సిపాలిటీల నిబంధనలను అనుసరించలేదన్నారు. బహిరంగ వేలం విధానాన్ని పాటించలేదన్నారు. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటిన్ పెడరేషన్ ఆస్తులను అమూలు అప్పగించే నిమిత్తం రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇప్పటికే పిల్ దాఖలు చేశారన్నారు. దానిపై విచారించిన కోర్టు.. అమూల్ పాల సేకరణ, వ్యాపార అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన సొమ్ము ఖర్చుచేయవద్దని.. ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషన్లో తెలిపారు. 'ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని చట్ట నిబంధనలకు విరుద్ధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానాన్ని రద్దు చేయండి.. తీర్మానం అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి' అని పిటిషనర్ కోరారు.
ఇదీ చదవండి: ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చాం.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్రం