కళ్లెం విడిచిన గుర్రంలా దూసుకెళుతున్న ఇంధన ధరలు. వినియోగదారుడి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. గత పది రోజుల్లోనే సగటున లీటరుకు 7రూపాయల వరకూ ధర పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. విజయవాడలో లీటర్ పెట్రోల్ 117 రూపాయలు, డీజిల్ లీటరు 103 రూపాయలకు చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లా కుప్పంలో లీటర పెట్రోలు 119రూపాయల 69 పైసలు, డీజిల్ 105రూపాయల 18పైసలు వసూలు చేస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలతో వినియోగదారులపై మోయలేని భారం పడుతుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటిపై ఎక్సైజ్, రాష్ట్ర అమ్మకపు పన్నుల రూపంలో కనకవర్షం కురుస్తోంది. మార్చి 22 నుంచి పది రోజుల్లో 9సార్లు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచారు. ఇంధన సంస్థలు రోజూ సగటున 80 పైసలకు పైనే పెంచుతున్నాయి. గురువారం కూడా లీటరు పెట్రోలుపై 87 పైసలు, డీజిల్‌పై 83 పైసల చొప్పున భారం వేశాయి.
2021 నవంబరు 3న.... గరిష్ఠంగా లీటరు పెట్రోలు 117రూపాయలు, డీజిల్ 109 రూపాయల ధర ఉంది. కేంద్రం లీటరు పెట్రోలుపై 5రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించడం, దానిపై రాష్ట్ర పన్నులు కూడా తగ్గడంతో లీటరు పెట్రోలు 110రూపాయలు, డీజిల్ 96 రూపాయల వరకూ దిగొచ్చింది. ఐదు నెలల తర్వాత మార్చి 22 నుంచి ఈ పది రోజుల్లో తొమ్మిది సార్లు ధరలు పెరగడంతో పెట్రోలు ధర మళ్లీ 117రూపాయల డీజిల్ 103రూపాయలకు చేరింది. ఏప్రిల్‌లోనూ ధరల పెరుగుదల కొనసాగుతుందన్న ఇంధన కంపెనీల సంకేతాలతో..పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకెంత కొండెక్కుతాయోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇంధనధరల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కేంద్రం ఎక్సైజ్‌సుంకం తగ్గించినప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలు ముందుకొచ్చి తమ పన్నులు తగ్గించాయి. అప్పటి వరకు దేశంలోనే అత్యధిక ధరలున్న రాజస్థాన్ కూడా వినియోగదారులకు ఈ వెసులుబాటు కల్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పైసా కూడా తగ్గించకపోవడం వల్ల.... ఇంధన ధరలు అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అధికంగా ఉన్నాయి.
గతేడాది నవంబరులో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోతోందని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో మళ్లీ ఆదాయం.. భారీగా పెరగనుంది. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే కొద్దీ..రాబడి మరింత అధికం కానుంది. అటు కేంద్రానికీ ఎక్సైజ్ సుంకం రూపంలో ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి అమ్మకపు పన్ను, అదనపు వ్యాట్, రోడ్డు సెస్‌ల రూపంలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల పంట పండనుంది.
రాష్ట్రానికి పన్నుల పంట!
గతేడాది నవంబరులో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోతోందని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో మళ్లీ ఆదాయం భారీగా పెరగనుంది. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే కొద్దీ.. రాబడి మరింత అధికం కానుంది. దీంతో అటు కేంద్రానికీ ఎక్సైజ్ సుంకం రూపంలో ఆదాయం పెరుగుతుంది.
* రాష్ట్రానికి అమ్మకపు పన్ను, అదనపు వ్యాట్, రోడ్డు సెస్‌ల రూపంలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల పంట పండనుంది.
* గత కొన్నేళ్లుగా పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రానికి ఏటికేడు పెరుగుతోంది. 2014-15లో రూ.8,777 కోట్లు ఉన్న రాబడి.. 2020-21 నాటికి రూ.11,014 కోట్లకు చేరింది.
* గతేడాది ధరలు గరిష్ఠ స్థాయికి చేరడంతో ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2020-21తో పోలిస్తే.. 2021-22 తొలి 6 నెలల్లోనే రూ.2,731కోట్లు అధికంగా లభించడం గమనార్హం.
ఇదీ చదవండి: విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ ఆందోళన