YCP Gadapa Gadapaku: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా.. వైకాపా నేతలు మంగళవారం వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటించారు. నేతలపై వీధివీధినా ప్రశ్నల వర్షం కురిపించారు జనాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో గడపగడపకు వెళ్లిన మంత్రి ఉషశ్రీ చరణ్‌కు సమస్యలు స్వాగతం పలికాయి. మంచినీటి సమస్య తీర్చాలని పాతచెరువు ప్రజలు కోరారు. గోళ్ల గ్రామ మహిళలు వివిధ సమస్యలు ప్రస్తావించారు. తన కుమారుడు స్థానిక వైకాపా నాయకుడు వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నా.. ప్రభుత్వం ఇల్లు కూడా ఇవ్వలేదని ఓ పెద్దావిడ వాపోయింది.
గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఓ ఇంటికి వెళ్లిన ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. జగన్ పాలన బాగోలేదంటూ మొహానే చెప్పేశాడు. లింగపాలెం మండలం వేములపల్లిలో ఎలీజా పర్యటించారు. చంద్రరావు అనే గ్రామస్థుడితో ముచ్చటించారు. డబ్బులు పడుతున్నాయి కదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. ఊళ్లో సమస్యలన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయని చంద్రరావు బదులిచ్చారు. సొంత పార్టీ నేతలకే పింఛన్ ఇవ్వకపోతే ఎలా పనిచేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైకాపా కార్యకర్త నిలదీశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు... ప్రజలు తమ సమస్యలు నివేదించారు. దివ్యాంగుడైన తన కుమారుడికి ఏడాది నుంచి పింఛను ఆపేశారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మరో ఇంట్లో ఏ ఆధారం లేని వితంతువు, కళ్లు లేని వృద్ధురాలికి పింఛను రావడం లేదని ఎమ్మెల్యేకి తెలియజేశారు. గతంలో ఉన్న రేషన్ కార్డు కూడా తొలగించారని వాపోయారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో గడపగడపకు నిర్వహించిన మేకపాటి విక్రమ్‌రెడ్డిని ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఓ వ్యక్తి నిలదీశారు. ఏవో కారణాలు చెబుతూ తమకు ఇల్లు మంజూరు చేయలేదన్నారు. అధికారుల సొంత రూల్స్ పెట్టడం సరికాదన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్లలో గడగడపకు కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యుడితో సర్పంచ్, వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. సొంతంగా ఆసుపత్రి నడుపుతూ పీహెచ్‌సీని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై వైద్యాధికారి అభ్యంతరం తెలిపారు. డ్యూటీ సక్రమంగా చేయకపోతే అడగాలి తప్ప, వ్యక్తిగతం మీకెందుకు అంటూ ఎదురు ప్రశ్నించారు. వారికి ఎమ్మెల్యే సర్దిచెప్పారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు.. వాలంటీర్ లోకేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం తరఫున ఏ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగిందో.. ఆ జాబితాను వాలంటీర్లు సిద్ధం చేశారు. కాగా రేణుక బెహర అనే మహిళ ఇంటికి వెళ్లేసరికి వాలంటీర్ సిద్ధం చేసిన జాబితాలో ఆమె పేరు కనిపించ లేదు. వెంటనే వాలంటీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. 'ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చారంటూ' మండిపడ్డారు. అలాగే తెలుగుదేశం నాయకులు ఏదైనా కార్యక్రమం చేయడానికి వస్తే ప్రజలు వెళ్తున్నారని.. నువ్వు ఏం చేస్తున్నావని వాలంటీర్‌పై కన్నెర్రజేశారు.
'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం సిరుగురాజుపాలెంలో పర్యటించిన మంత్రి రోజా.. ఓ వృద్ధుడిని పలకరించారు. పింఛన్ వస్తుందా అని ఆరా తీశారు. వస్తుందని సమాధానమిచ్చిన వృద్దుడు.. తాను ఒంటరిగా ఉంటున్నానని, పెళ్లి కూతురుని చూడాలని కోరారు. వృద్ధుడి వింత విజ్ఞప్తితో రోజా అవాక్కయ్యారు. 'పింఛను అయితే ఇవ్వగలం గానీ... పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాం' అంటూ రోజా ఆక్కడినుంచి నవ్వుతూ వెళ్లిపోయారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది.