గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని... ప్రస్తుత ప్రభుత్వం దాన్ని మార్చకూడదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాయపూడి రైతులకు సంఘీభావం తెలిపిన పవన్... కేంద్ర పెద్దలతో మాట్లాడినప్పుడు వాళ్లూ ఇదే చెప్పారని వివరించారు. తన స్వలాభం, స్వార్థం కోసం భాజపాతో పొత్తు పెట్టుకోలేదని.. ప్రజల క్షేమం కోసమే పొత్తు పెట్టుకున్నానని స్పష్టం చేశారు. రైతులు తెదేపాకు భూములు ఇవ్వలేదని.. ప్రభుత్వానికి ఇచ్చారని పేర్కొన్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధిని తానూ కోరుకుంటున్నానని చెప్పారు. ఒక కోర్టు వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదని పేర్కొన్నారు.
మళ్లీ భూసేకరణ ఎందుకు..?
విశాఖలో భూసమీకరణ చేస్తున్నారని... ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు ఉంటే విశాఖలో మళ్లీ భూసమీకరణ ఎందుకని ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. అమరావతిలో చాలా రోజులుగా కులమతాలకు అతీతంగా రైతులు దీక్ష చేస్తున్నారని చెప్పారు. ఇది కేవలం ఒక సామాజికవర్గానికి చెందినది కాదన్నారు. తెదేపాతో గొడవ ఉంటే వారితో చూసుకోవాలని కాని రాజధాని మార్పు తగదని హితవు పలికారు. రాజధాని పోరాటంలో 40 మందికిపైగా రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ హత్యలే అని పేర్కొన్నారు.
కేంద్రం అనుమతిలేదు...
రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రైతులు భూములు ఇచ్చారని కొనియాడారు. అనంతవరంలో రైతుల దీక్షలకు పవన్ మద్దతు తెలిపారు. రాజధాని తరలింపు అంశాన్ని ఎన్నికల ముందే జగన్ చెప్పి ఉండాల్సిందన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలవడం వైకాపా అదృష్టమని... ఆ బలం నిలుపుకోకుండా ప్రజలను అస్థిరత్వానికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తులు, పార్టీల ఆధిపత్య పోరును ప్రజల సమస్యగా మార్చారని విమర్శించారు. 3 రాజధానుల అంశానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు. అమరావతికి కట్టుబడి ఉన్నామని భాజపా నేతలు చెప్పినట్టు స్పష్టం చేశారు. ప్రజలను రోడ్లమీదకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేవి అసలు పార్టీలే కాదన్నారు.
ఇవీ చదవండి.. 'భాజపాతో కలిసి భరోసా ఇస్తున్నా.. రాజధాని ఎక్కడికీ పోదు'