జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో జనసైనికులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి, ఆవిరిపట్టే మిషన్లు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ అందించారు.
కొత్తపేట నియోజకవర్గంలో అభిమానులు పవన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలమూరు మండలంలో సంధిపూడి గ్రామ జన సైనికులు ఇటీవల చిన్నవయసులోనే హఠాత్తుగా మరణించిన తోటి జన సైనికుడు నల్లా లక్ష్మీపతి కుటుంబానికి రూ.31000 నగదును అందించారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్న కొత్తపేట మండలం అవిడి పీహెచ్సీ వైద్యులను జనసేనలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. రావులపాలెంలో వృద్ధులకు పండ్లు, దుప్పట్లను అందించారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు పవన్ కల్యాణ్ అభిమానులు వేర్వేరుగా వేడుకలు నిర్వహించుకున్నారు. జనసేన నాయకులు కళాకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తమ అభిమాన నాయకుడి పిలుపు మేరకు తలసేమియా వ్యాధి బాధితులకు రక్తాన్ని అందించి నట్లు అభిమానులు తెలిపారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మాకవరపాలెం మండలం భీమ బోయిన పాలెంలో జనసేన నాయకులు రాజన్న, సూర్య చంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి..అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. గ్రామస్థులకు మొక్కలను పంపిణీ చేయడంతో పాటు వీధులను పరిశుభ్రంగా చేశారు. పాయకరావుపేట, అనకాపల్లిలోనూ పవన్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కేకు కట్ చేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. సినిమాహాల్లో పనిచేసే కార్మికులకు నిత్యావసర సరుకులు, మాస్కులు, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు