ఇప్పటి వరకు 50 శాతం సీట్ల సామర్థ్యంతో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఇకపై అన్ని సీట్లలోనూ ప్రయాణికులను అనుమతించేలా యాజమాన్యం గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పాటించాల్సిన నిబంధనలను అన్ని జిల్లాలకూ పంపింది. బస్సులను గుర్తింపు ఉన్న బస్టాండ్లు, బస్‌స్టాపుల్లో మాత్రమే ఆపాలని, ఇతరచోట్ల ఆపొద్దని పేర్కొన్నారు. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు చేతులు శానిటైజ్ చేసుకోవాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించేలా సిబ్బంది చూడాలన్నారు.
తొలుత సీటుకు ఓ ప్రయాణికుడి చొప్పున అనుమతించి, అన్ని సీట్లు నిండాక పక్కన మరొకరు చొప్పున కూర్చునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. నిత్యం రెండుసార్లు బస్సును శానిటైజ్ చేయాలని, నిబంధనల పర్యవేక్షణకు ప్రతి బస్టాండ్‌లో ఓ అధికారిని నియమించాలని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ సమయంలో కూడా.. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులతో రాత్రి సర్వీసులు నడిపేలా ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి: 'ఏకాగ్రంగా కొలుచుకుంటే.. అనుగ్రహించే కరుణా సముద్రుడు'