Vizag Metro Project Awaits Central Government NOD : కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ప్రాంత ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, వెలగపూడి రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 76.90 కి.మీ. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై పంపిన డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.
వంద శాతం నిధులూ కేంద్రం భరించేలా ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. తొలి దశలో 3 కారిడార్లలో 42 స్టేషన్లతో 46.23 కి.మీ. మేర నిర్మించే ప్రాజెక్టుకు రూ.11,498 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఒకటో కారిడార్‌లో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది కూడలి వరకు(34.4 కి.మీ.), రెండోది గురుద్వారా-ఓల్డ్ పోస్టాఫీస్ వరకు (5.07 కి.మీ.), మూడో కారిడార్‌లో తాటిచెట్లపాలెం -చినవాల్తేరు వరకు(6.75 కి.మీ) పనులు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు.
త్వరలోనే విజయవాడకు మెట్రో రైలు - కేంద్రానికి ప్రతిపాదనలు
మలి విడతలో భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు : మలి విడతలో కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67 కి.మీ. మేర 12 స్టేషన్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాశామని వివరించారు. మెట్రో మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్ వస్తున్నాయని ఎన్డీఏ ప్రజాప్రతినిధులు తెలపడంతో ట్రాఫిక్ నిలిచిపోకుండా కార్‌షెడ్ ఎండాడ, హనుమంతవాక, మద్దిలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, గాజువాక స్టీల్ ప్లాంట్ జంక్షన్‌ల వద్ద టూ లెవల్ మెట్రో, ఫ్లైఓవర్‌లు నిర్మించే ప్రతిపాదనలూ సిద్ధం చేస్తున్నామని నారాయణ వివరించారు.
నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ చర్యలు కుట్రపూరితం : 2014 విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో పేర్కొన్న ప్రకారం 2016లో టీడీపీ ప్రభుత్వం విశాఖ రైల్వే ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలకు ఉపక్రమించింది. కొన్ని కంపెనీలు బిడ్లు కూడా దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టుతో పార్టీకి మంచి పేరు వస్తుందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పనులు నిలిపేసింది. భోగాపురం వరకూ పొడిగింపు సాకుతో పనులు ముందుకు సాగనీయలేదని మంత్రి వివరించారు.
విజయవాడ మెట్రో అమరావతికి అనుసంధానం - కేంద్రమంత్రితో నారాయణ చర్చలు