Aadudam Andhra Scam in AP : ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం పేరుతో గత సర్కార్ కోట్ల రూపాయల ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు చేసింది. దీంట్లో వైఎస్సార్సీపీ నాయకులు అందిన మేరకు కమీషన్ల రూపంలో జేబుల్లో వేసుకున్నారు. మరి దీనిపై సీఐడీ ఎన్ని రోజులు విచారించిందో తెలుసా? ఒక్కటంటే ఒక్కరోజే. ఇంత భారీ కుంభకోణాన్ని ఒక్క రోజులో వెలికి తీయొచ్చా? అంతటి పరిశోధన సామర్థ్యం మన సీఐడీకి ఉందా?
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సర్కార్ చేసిన రూ.119 కోట్ల ఖర్చుపై విచారణ చేపట్టాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ రవినాయుడు ఆ ఖర్చుల లెక్కలతో 40 రోజుల క్రితం సీఐడీకి లేఖ రాశారు. విచారణ పేరుతో శాప్ కార్యాలయానికి ఒకే రోజు వచ్చిన అధికారులు మళ్లీ జాడలేరు. ఆడుదాం ఆంధ్రాలో క్రీడా పరికరాలు, టీ షర్టుల కొనుగోళ్లు, క్రీడాకారులకు భోజన, వసతి, రవాణా ఖర్చుల్లో అప్పటి సర్కార్ పెద్దలు, అప్పట్లో కొందరు అధికారులు కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీఐడీ విచారణ తూతూమంత్రంగా సాగితే ఈ అవినీతి బాగోతం బయటపడేదెలా? ఇలాగే తాత్సారం చేస్తే రికార్డులు మాయమైనా ఆశ్చర్యం లేదు.
క్రీడా పరికరాల కొనుగోళ్లకు రూ.37.50 కోట్లు : పోటీలకు సంబంధించిన క్రీడా సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం చోటుచేసుకుందన్నది ప్రధాన అభియోగం. ఉత్తర్‌ప్రదేశ్, బెంగళూరు, దిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన ఆరు సంస్థల నుంచే రూ.37.50 కోట్లకు పైగా విలువైన క్రీడాసామగ్రి కొనుగోలు చేశారు. క్రీడలతో ఏ మాత్రం సంబంధం లేని రోడ్లు, భవనాలశాఖ ద్వారా అప్పట్లో టెండర్లు పిలిచారు. ఈ మేరకు సరఫరా సంస్థలను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే భారీగా కమీషన్ల వ్యవహారం నడిచిందన్నది ఆరోపణ.
అప్పట్లో కొందరు అధికారులను క్రీడా పరికరాల తయారీ సంస్థలు ఉన్న ప్రాంతాలకు పంపి నాణ్యత అద్భుతంగా ఉందంటూ సర్టిఫికెట్లు ఇప్పించేశారు. క్రికెట్ బ్యాట్లు ఒకటి, రెండు మ్యాచ్‌లకే విరిగిపోవడంతో నాణ్యతలో డొల్లతనం బయటపడింది. నాణ్యత లోపించిన ఇతర క్రీడా పరికరాలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త వహించారు. ఇవి ఎక్కడున్నాయో ఇప్పటికీ తెలియదు. క్రీడా పరికరాలు ఏయే సంస్థల నుంచి కొన్నారు? ఇందుకోసం ఎంత ఖర్చుపెట్టారు తదితర వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద పలువురు అర్జీ చేశారు. అప్పట్లో శాప్ అధికారులు ప్రస్తుతానికి సమాచారం అందుబాటులో లేదన్నారు. ఆ తర్వాత సమయం పడుతుందని డొంక తిరుగుడు సమాధానం చెప్పి తప్పించుకున్నారు.
టిడ్కో ఇళ్లలో వసతి - ఖర్చేమో రూ.45 లక్షలు : ఆడుదాం ఆంధ్రాలో భాగంగా విశాఖలో ఐదు రోజులపాటు నిర్వహించిన ముగింపు ఉత్సవాలకు గత సర్కార్ రూ.2.70 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ, ప్రారంభానికి నోచని టిడ్కో ఇళ్లలోనూ క్రీడాకారులకు వసతి కల్పించి ఇందుకోసం రూ.45 లక్షలకు పైగా ఖర్చు పెట్టినట్లుగా శాప్ అధికారులు లెక్కలు చూపడం దోపిడీని కళ్లకు కడుతోంది. మరోవైపు క్రీడాకారుల భోజనాలకు రూ.65.51 లక్షలు ఖర్చు చేసినట్లుగా లెక్కలు కనిపిస్తున్నాయి. కానీ సరైన భోజన సదుపాయం లేదని అప్పట్లో క్రీడాకారులు ఆందోళనలు చేయడం గమనార్హం. ముగింపు ఉత్సవాల్లో పాల్గొనే వీవీఐపీలు, వీఐపీలకు రూ.30 లక్షలతో ఏర్పాట్లు చేశారట! మైదానాల్లో ఏర్పాట్లు, ఫొటో, వీడియోగ్రఫీకి రూ.36 లక్షలు ఖర్చుగా చూపారు.
కాగితాల్లో లెక్కలు - నేతల జేబుల్లోకి రూ.కోట్లు : జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహించిన పోటీలకు రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా శాప్ లెక్కలు చూపింది. వాస్తవంగా అప్పట్లో ఏర్పాట్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. రవాణా ఖర్చులకు రూ.76 లక్షలకు పైగా వెచ్చించామని చెబుతున్నారు. అనేక జిల్లాల్లో క్రీడాకారులు సొంత ఖర్చులతో బస్సుల్లో వచ్చారు. భోజన ఏర్పాట్లు అంతంత మాత్రంగా చేసినా ఒక్కో క్రీడాకారుడికి రూ.175 ఖర్చుతో భోజనం పెట్టించినట్లుగా లెక్కలు చూపారు. దీని కోసం మొత్తంగా రూ.4.26 కోట్లు వెచ్చించారట. వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన బినామీ ఆహార సరఫరా సంస్థలకు అధికారులు ప్రజాధనం దోచిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆటగాళ్లే లేని పోటీలకు ఖర్చు రూ.14.99 కోట్లు : ఆడుదాం ఆంధ్రాలో భాగంగా తొలి దశలో గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో నిర్వహించిన పోటీలకు క్రీడాకారులే కరవయ్యారు. ఆన్‌లైన్ ద్వారా దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి, క్రీడాకారుల నుంచి స్పందన అద్భుతంగా ఉందని సర్కార్ ప్రచారం చేసుకుంది. పోటీలు ప్రారంభమయ్యే నాటికి అత్యధిక సచివాలయాల్లో క్రీడాకారులే కనిపించలేదు. దీంతో సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దారిన పోయే వారందరిని పిలిచి ఆడించారు. చాలాచోట్ల పోటీలు నిర్వహించినట్లు కాగితాల్లో చూపించి, తోచిన పేర్లతో విజేతల జాబితాలను నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపారు. సచివాలయాల స్థాయిలో నిర్వహించిన పోటీలకు రూ.14.99 కోట్లు ఖర్చు చేసినట్లు శాప్ లెక్కలు చూపింది. ఈ నిధులు వైఎస్సార్సీపీ పెద్దలు, కొందరు అధికారుల జేబుల్లోకి వెళ్లాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆరంభశూరత్వమే! స్పందన కరవైన ఆడుదాం ఆంధ్రా - చేతులెత్తేసిన సచివాలయ సిబ్బంది!