paritala sunitha: వైకాపా నేతల వేధింపులకు పరిశ్రమలన్నీ రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని.. మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతం నుంచి జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డే కారణమని ఆరోపించారు. ఉపాధి కల్పించడం చేతగాని వైకాపా నాయకులు.. ఉన్న పరిశ్రమలను వెళ్లగొడితే యువత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జాకీ పరిశ్రమను వెళ్లగొట్టి ఎమ్మెల్యే వదిన పేరున... భూమిని కొట్టేయాలని కుట్రచేశారని విమర్శించారు. 2019లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే... పరిశ్రమ ఏర్పాటుతో రాప్తాడులో ఆరు వేల మంది మహిళలకు జీవనోపాధి దొరికేదన్నారు.
రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి ఏమి చేశారో చూపించాలని పరిటాల సునీత, శ్రీరామ్‌లు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి సవాల్ విసిరారు. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయిన జాకీ పరిశ్రమను వెనక్కు తీసుకొచ్చి చూపించాలన్నారు. జాకీ పరిశ్రమను తరిమేశారంటూ.. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న జాకీ పరిశ్రమ వెనక్కు వెళ్లటాన్ని వ్యతికేస్తూ పరిటాల సునీత, శ్రీరామ్‌లు ప్రతిపాదిత పరిశ్రమ భూమి నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యమానికి తెదేపా పిలుపు.. నేతల గృహ నిర్బంధం