కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా ఎ.పరమేశం నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ కృష్ణా బోర్డు ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఉన్నారు. ఈయన స్థానంలో ఇటీవల పదోన్నతి పొందిన పరమేశంను నియమిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.
4న బోర్డు సమావేశం
కృష్ణా బోర్డు సమావేశం జూన్ 4న జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది. కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు ఇవ్వడం, టెలిమెట్రీల ఏర్పాటు తదితర అంశాలు బోర్డు ఎజెండాలో ఉన్నాయి.
5న గోదావరి బోర్డు సమావేశం
జూన్ 5న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం జరపాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. ఏపీ, తెలంగాణలకు చెందిన అధికారులు, ఈఎన్‌సీలు హాజరు కానున్నారు.
కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు
గోదావరి పరీవాహకం నుంచి నీటిని తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టుల విషయంలో బోర్డు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదించే వరకు ముందుకు వెళ్లరాదంటూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సూచించిందని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ దృష్టికి తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శికి జీఆర్‌ఎంబీ శనివారం లేఖ రాసింది.
ఇదీ చదవండి..