తడిసిన ధాన్యం రంగు మారుతోంది. తేమ ఎక్కువగా ఉన్న చోట మొలకలు వస్తున్నాయి. నిబంధనలు సడలించి ప్రభుత్వం వీటిని కొనకపోతే రైతులు మరింత నష్టపోనున్నారు. కోతలు మొదలైన ప్రాంతాల్లో సేకరణ ప్రక్రియ ప్రారంభించడంలోనూ పౌరసరఫరాల శాఖ జాప్యం చేస్తోంది. సత్వర నిర్ణయాలు తీసుకోకపోతే నిండా మునిగిపోతామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఇంకా ఎడతెరపిలేని వానలే
ఎడతెరపిలేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టమేర్పడింది. మెట్ట పంటలతోపాటు కోత దశలో ఉన్న వరి కోలుకోలేని విధంగా దెబ్బతింది. మొత్తంగా 3.50 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిందని అంచనా. ఉభయగోదావరి, కడప జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల కోతలు కోశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ నూర్పిళ్లు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ఇది రంగు మారడంతోపాటు మొలకలూ వస్తోంది.
ఆరబెట్టే సమయమేది?
ధాన్యాన్ని ఆరబెడదామంటే వర్షం భయం పొంచి ఉంది. మళ్లీ తడిస్తే గింజ కూడా చేతికి రాదనే ఆందోళనలో రైతులున్నారు. అలాగని మొత్తం రాశులుగా చేసి పట్టాలు కప్పి ఉంచినా నష్టమే. తేమ ఎక్కువగా ఉండటంతో గింజ వేడెక్కి మొలకలు వస్తోంది. నిబంధనల ప్రకారం.. ధాన్యంలో 17% వరకు తేమను అనుమతిస్తారు. అంతకుమించి ఉంటే ఆరబెట్టుకుని తీసుకురమ్మంటున్నారు.
- వరి కోసి కుప్పలుగా వేసి నూర్పిడి చేస్తే ఈ మేరకు తేమ ఉంటుంది. యంత్రాలతో కోతల నేపథ్యంలో ధాన్యంలో తేమ ఎక్కువగానే ఉంటుంది. అందుకే రైతులు 1,2 రోజులు ఆరబెడతారు. అయినా తేమ ఉందంటూ ధర తగ్గించడం రివాజుగా మారింది.
- భారీ వర్షాలు, ముసురు వాతావరణం నేపథ్యంలో వరిలో తేమ ఎక్కువగానే ఉంది. 20% నుంచి 22% వరకుండే అవకాశముందని రైతులే పేర్కొంటున్నారు.
4% వరకే అనుమతి..
నిబంధనల ప్రకారం ధాన్యంలో 4% మేర దెబ్బతిన్న, రంగుమారిన, మొలకలొచ్చిన, పురుగుపట్టిన గింజలను అనుమతిస్తారు. వాతావరణం బాగుంటే రైతులు కూడా సాధ్యమైనంతవరకు నాణ్యమైన ఉత్పత్తులనే అమ్మకానికి తీసుకెళ్తారు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిచి రంగు మారుతోంది. కోతకు వచ్చిన వరి నేల వాలింది. మాగాణిలో నీటిని బయటకు పంపి కోయించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.
పూర్తిస్థాయిలో మొదలుకాని సేకరణ
ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పలు చోట్ల సేకరణ పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో 3రోజుల కిందట ప్రారంభించిన కేంద్రం ద్వారా 200 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ఆర్‌బీకేల్లో ధాన్యం కొనుగోలు చేయాలని, తమకు గోతాలు ఇవ్వాలంటూ పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో రైతులు తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దీంతో స్థానిక అధికారులు రైతులతో మాట్లాడి కొనుగోళ్ల ఏర్పాట్లు చేశారు. తేమ తక్కువగా ఉంటే తీసుకుంటామని భరోసానిచ్చారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం తీసుకోవాలని రైతులు ఆర్‌బీకేల వద్దకు వెళుతున్నప్పటికీ నిరాశే ఎదురవుతోంది. తమకు ఎలాంటి ఆదేశాల్లేవని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
ఇదీ చూడండి:
Municipal elections: ఉద్రిక్తతల మధ్య పురపోరు.. కుప్పంలో దొంగ ఓటర్లను అడ్డుకున్న తెదేపా