ముఖ్యమంత్రి జగన్ బీసీలను సంక్షేమం పేరుతో వంచిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైకాపా పాలనలో బీసీ కార్పొరేషన్లు నేతి బీరలో నెయ్యి చందంగా ఉన్నాయని విమర్శించారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసిన జగన్కు కుల వృత్తుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రూ.5 వేలు జీతం వచ్చే వాలంటీర్ పోస్టులు బీసీలకిచ్చి లక్షల్లో జీతాలున్న పదవులు సొంత వారికిచ్చుకున్నారని మండిపడ్డారు.
56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న వైకాపా...కార్పొరేషన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది తెదేపా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించిన జగన్ బీసీలకు ఏ విధంగా మేలు చేశారో చెప్పాలని అనురాధ ప్రశ్నించారు. నామినేటెడ్ పదవులు గురించి మాట్లాడుతున్న జగన్...700కి పైగా నామినేటెడ్ పదవులు, 30 మంది సలహాదారులు, తితిదే బోర్డు వంటి కీలక పదవుల్లో బీసీలకు ఎంత శాతం కల్పించారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : వర్షాలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు