OTS: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్‌టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పేరుతో పేదల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని జగనన్న కాలనీలను ఇళ్ల నిర్మాణానికి అనువుగా మార్చేందుకు ప్రభుత్వం వినియోగించనుంది. ఇళ్ల స్థలాల చదును, అప్రోచ్ రహదారుల నిర్మాణం, విద్యుత్తు స్తంభాల మార్పు, అంతర్గత రహదారుల ఏర్పాటుకు నిధులు వెచ్చించనుంది. ఇందుకు రూ.120 కోట్ల వరకు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే రూ.17 కోట్ల నిధుల్ని జిల్లాలకు విడుదల చేశారు. 50, అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న లేఅవుట్లలోనే ఈ నిధుల్ని వెచ్చిస్తారు. ఈ పనులను రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్తుశాఖ నిధులతో చేపట్టాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులపై ఇప్పటికే ఆయా శాఖలకు గృహ నిర్మాణశాఖ నివేదించినా ముందుకు సాగలేదు. దీంతో ఓటీఎస్ నిధుల్ని వినియోగించి పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ నిర్ణయించింది.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి దాదాపు 52లక్షల మంది అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటివరకు సుమారు 8.50 లక్షల మంది పథకాన్ని వినియోగించుకున్నారు. ఇందులో ఓటీఎస్ (రుణం తీసుకున్న వారికి వర్తిస్తుంది) మొత్తాన్ని చెల్లించిన వారు 2.30 లక్షల మందికిపైగా ఉన్నారు. రూ.200 కోట్లకుపైగా వసూలైంది. ఈ మొత్తాన్ని ఇళ్ల నిర్మాణానికి వీలుగా లేని లేఅవుట్లను బాగు చేసేందుకు వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 700పైగా లేఅవుట్లు స్థలాల చదును, అప్రోచ్ రోడ్లు, కల్వర్టుల ఏర్పాటు, స్థల సేకరణ సమస్యల కారణంగా ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేనట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి:
CM Jagan Meet PM Modi: ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఊరట: ప్రధానికి సీఎం జగన్ వినతి