ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న ఎయిడెడ్, మైనారిటీ జూనియర్ కళాశాలల స్వాధీనం, అన్‌ఎయిడెడ్‌గా కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్న కళాశాలల నుంచి సిబ్బంది వెనక్కి తీసుకునేందుకు అనుసరించాల్సిన విధానాలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల విషయంలో పాటించిన నిబంధనలనే జూనియర్ కళాశాలలకూ అమలు చేయనున్నారు. స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న కళాశాలలు, సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న యాజమాన్యాల నుంచి ఇంటర్మీడియట్ కమిషనర్ లిఖిత పూర్వక అనుమతి తీసుకుంటారు.
* ఆస్తులతో పాటు అప్పగించేందుకు అనుమతి తెలిపిన యాజమాన్యాలకు ఎలాంటి పరిహారం చెల్లించరు. కళాశాల యాజమాన్యాలు స్థిర, చరాస్తులను ప్రభుత్వానికి అప్పగించాలి. స్వాధీనం చేసుకున్నాక విద్యా సంస్థల అవసరాలకు మించి ఉన్న ఆస్తులను ప్రజావసరాలకు వినియోగించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
* ఒకసారి అప్పగించగానే ఇవి ప్రభుత్వ కళాశాలలుగా మారిపోతాయి. వీటిలో పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వంలోకి తీసుకుంటారు. పార్ట్ టైమ్ సిబ్బందిని పొరుగుసేవల సిబ్బందిగా పరిగణిస్తారు.
* అన్‌ఎయిడెడ్‌గా కొనసాగే యాజమాన్యాలకు ఉచితంగా గానీ, రాయితీపైగానీ ప్రభుత్వం, దాతలు ఇచ్చిన ఆస్తులను ఇతర అవసరాలకు వినియోగించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
* ప్రైవేటు సంస్థలుగా మారే కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, వారి పిల్లలను ఎక్కడ ప్రభుత్వ కళాశాలలో చేరతామంటే అక్కడ సర్దుబాటు చేస్తారు.
ఇదీ చదవండి: ASSEMBLY SESSION: సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు