అభివృద్ధిపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మూడేళ్లలో 3 ప్రాంతాలకు ఏం చేశారో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతికి కేంద్రం ఎన్నో సంస్థలు, నిధులు ఇచ్చిందని అన్నారు. అమరావతిలో దోచుకోవడానికి జగన్‌కు ఏమీ కన్పించలేదని అందుకే.. జగన్ కన్ను విశాఖపై పడిందని ఆరోపించారు. ప్రజలు అవసరమైనప్పుడు జగన్‌కు తడాఖా చూపిస్తారని హెచ్చరించారు.
వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలు వద్దు: రాజధానిపై హైకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని ప్రభుత్వంపై భాజపా ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. కోర్టుల అధికారాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అమరాతిని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించలేదా? అని ప్రశ్నించారు. సీఆర్డీఏ, రైతులకు మధ్య చట్టబద్ధ ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. సీఆర్డీఏను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు చెప్పిందని.., చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని కోర్టు చెప్పలేదని అన్నారు. వికేంద్రీకరణ పేరుతో విద్వేష రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాజధాని అమరావతికి అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
వివాదాన్ని పెంచేలా మాట్లాడుతున్నారు: రాజధానిపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వివాదాన్ని పెంచేలా సీఎం, మంత్రులు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కోర్టు తీర్పును అమలు చేసి వివాదాలకు ముగింపు పలకాలని హితవు పలికారు. అమరావతికి, అభివృద్ధికి, వికేంద్రీకరణకు ముడిపెట్టడం సరికాదన్నారు. పరిపాలన, శాసన రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు.
రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజల తీర్పును కోరండి: శాసనసభలో చట్టాలు చేయాలి కానీ జనాల ప్రాణాలు తీసే చట్టం చేస్తామంటే కోర్టులు ఊరుకోవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలీని వాళ్లు శాసనసభ్యులుగా ఉన్నారన్న ఆయన.. ప్రజలకు కావల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ అని అన్నారు. శాసనసభలో వైకాపా ప్రభుత్వం మళ్లీ మూడు ముక్కలాటకు శ్రీకారం చుట్టటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
భావితరాల భవిష్యత్తుపై ఇంత కక్షగా వ్యవహరించటం దురదృష్టకరమని మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలకు వెళ్లకుండా మొండిగా వితండవాదం చేయటమేంటని ప్రశ్నించారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది విధ్వంసం చేయటానికి కాదన్న చంద్రబాబు.., అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి జగన్‌కు లేదన్నారు. చేతనైతే రాజధాని అమరావతి అంశంపై ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోరాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: Three Capitals: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: సీఎం జగన్