తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టని నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఆన్‌లైన్ తరగతులే నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జులై 1 నుంచి కేజీ టూ పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. సెట్ పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జులైలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించకముందే.. దూరదర్శన్ యాదగిరి, టీ శాట్ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్ పాఠాలు చెప్పినట్లు మంత్రి సబిత చెప్పారు. దీనిపై కేంద్రం సైతం ప్రశంసలు కురిపించిందన్నారు. క్షేత్రస్థాయి వరకూ సక్రమంగా నిర్వహించినట్లు తెలిపారు.
స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేనివారికి గతేడాది మాదిరిగానే.. దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ద్వారా ఆన్‌లైన్ బోధన నిర్వహిస్తామని తెలిపారు. దూరదర్శన్ యూట్యూబ్‌లోనూ పాఠాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంబంధించిన 90 శాతం పుస్తకాలు జిల్లాలకు చేరినట్లు తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి గతంలో ఇచ్చిన 46 జీవోనే పాటించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. ట్యూషన్ ఫీజులు నెలవారీగా వసూలు చేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: