ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ పంపిణీ ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు ఉచితంగా అందించిన బియ్యం గతంలోలాగే.. కిలోకు రూ.1 చొప్పున పంపిణీ చేయనున్నారు. నిర్దేశిత ధరలపై ఇతర నిత్యావసరాలను మొబైల్ వాహనాల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేస్తారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యం పంపిణీ 15వ తేదీ తర్వాత డీలర్లద్వారా ప్రారంభం కానుంది. ఇకపై ప్రజాపంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే నిత్యావసరాలకు నిర్దేశిత నగదు వసూలు చేయనున్నారు.
నిల్వల్లేవు
కేంద్రం ప్రకటించినట్లుగా.. పీఎంజీకేవై కింద పంపిణీకి జులై నుంచి నవంబరు వరకు 10.78 లక్షల టన్నుల బియ్యం అవసరం. మా వద్ద అంత మేర సార్టెక్స్ బియ్యం నిల్వలు లేవు. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా ఎఫ్‌సీఐ ద్వారా తీసుకుని అమలు చేయాలని ఆదేశించారు. అది సార్టెక్స్ బియ్యం కాదు. రెండింటి నాణ్యతలో తేడా ఉండటంతో.. మొబైల్ వాహనాల ద్వారా సార్టెక్స్ బియ్యం, డీలర్ల ద్వారా నాన్ సార్టెక్స్ బియ్యం అందిస్తాం. - కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాలశాఖ
ఇదీ చదవండి: HOUSING PROGRAMME: రాష్ట్రవ్యాప్తంగా 2.02 లక్షల ఇళ్లకు శంకుస్థాపన