వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలో 200 ఎకరాలకుపైగా భూమి నీట మునుగుతుందని ఒడిశా అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. భువనేశ్వర్‌లో ఏపీ, ఒడిశా అధికారుల మధ్య జరిగిన చర్చల్లో.. అనంతరం ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ సమీక్షలోనూ.. ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది.
నేరడి(NERADI BARRAGE ON VAMSHADHARA) బ్యారేజి నిర్మాణం వల్ల ఒడిశాలో 106 ఎకరాల భూమే ముంపునకు గురవుతుందని, దాని నివారణకు కరకట్టలు నిర్మిస్తామని ఏపీ అధికారులు చెప్పగా.. ముంపు ఇంకా ఎక్కువ ఉంటుందని ఒడిశా అధికారులు చెప్పినట్టు సమాచారం. బ్యారేజీ ఎత్తును పరిగణనలోకి తీసుకుని ముంపు అంచనా వేశామని, ఇంకా ఎక్కువ ఉంటే దానికి అనుగుణంగా కరకట్టల నిర్మాణం చేపడతామని ఏపీ అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది.
జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఒడిశాలోని 300 ఎకరాల అటవీ భూమి అవసరమవుతుందని ఆ రాష్ట్ర అధికారులు చెప్పినట్టు తెలిసింది. దానికి అటవీ, పర్యావరణశాఖ అనుమతి తీసుకోవాలని, సీడబ్ల్యూసీ అనుమతి కూడా తీసుకోవాలని వారు చెప్పినట్లు సమాచారం. జంఝావతి ప్రాజెక్టు వల్ల ఒడిశాలో ముంపునకు గురవుతున్న గ్రామాలు, భూములకు మెరుగైన పునరావాస ప్యాకేజీ కావాలని వారు ప్రతిపాదించినట్టు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశాలో ముంపునకు గురవుతున్న ప్రాంతాలపైనా చర్చ జరిగిందని, ఆ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు కావాలని ఒడిశా అధికారులు కోరారని తెలిసింది.
ఇదీ చూడండి: petrol rates: పెట్రో వాతపై హారన్ల మోత