కరోనా నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన ఫోన్ సంభాషణను విమర్శిస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేయడం, దాన్ని ముఖ్యమంత్రి జగన్ ఖండించడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రధానికి మద్దతుగా జగన్ ట్వీట్ చేయడాన్ని ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా ఖండించారు.
ప్రధాని మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ సీఎంలతో, పుదుచ్చేరి, జమ్ము, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధాని ఫోన్ సంభాషణ తర్వాత హేమంత్ సోరెన్ ‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాట చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అని హిందీలో ట్వీట్ చేశారు.
హేమంత్ ట్వీట్‌ను ఆక్షేపిస్తూ సీఎం జగన్ శుక్రవారం ట్వీట్ చేశారు.
‘‘ప్రియమైన హేమంత్ సోరెన్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మన మధ్య ఎన్ని విభేదాలున్నా ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని, అది మన జాతిని బలహీనపరుస్తుందని ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం కొవిడ్‌పై పోరాడుతున్నాం. ఇది ఒకరినొకరు వేలెత్తి చూపించుకునే తరుణం కాదు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మనమంతా చేయీచేయి కలిపి ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది’ అని పేర్కొన్నారు.
జగన్ ట్వీట్‌పై ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా రీట్వీట్ చేశారు.
‘కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి పెద్ద నాయకుడి కుమారుడివై ఉండి సీబీఐ, ఈడీ దాడులకు భయపడి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో ఇలా లాలూచీ పడటం సరికాదు. మీరు ఎదగాలి జగన్. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు’ అని విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: