NTR YOUNGER DAUGHTER DIED: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనధికారిక సమాచారం. ఉమామహేశ్వరి మరణంపై కుమార్తె దీక్షిత పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు డయల్ 100కి ఫోన్ చేసినట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన జూబ్లీహిల్స్ పోలీసులు మధ్యాహ్నం 2.45 గంటలకు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ఉమామహేశ్వరి మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

ఆమె మరణ వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఆమె ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే నందమూరి కల్యాణ్ రామ్ అక్కడికి చేరుకున్నారు. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. చిన్న కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది. పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావాల్సి ఉంది. ఉమామహేశ్వరి అంత్యక్రియలు బుధవారం జరిగే అవకాశం ఉంది. మరోవైపు, పోస్టుమార్టం కోసం ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భౌతికకాయం వెంట బాలకృష్ణ, రామకృష్ణ, నారా లోకేశ్ సహా మరికొందరు కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు.

ఉమామహేశ్వరి నేత్ర దానం..: ఉమామహేశ్వరి భౌతికకాయానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ఆస్పత్రి నుంచి ఆమె మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలిస్తున్నారు. కంఠమనేని ఉమామహేశ్వరి కోరిక మేరకు ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.

ఉమామహేశ్వరి భౌతికకాయానికి ఎంబామింగ్..: అనారోగ్య కారణాల నేపథ్యంలో ప్రాణాలు విడిచిన ఉమామహేశ్వరి భౌతికకాయానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఎంబామింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఆమె పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో అంత్యక్రియలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె భౌతికకాయానికి ఎంబామింగ్ ప్రక్రియ చేశారు. మరోవైపు, పోస్టుమార్టం నివేదికను రెండు రోజుల్లో అందిస్తామని ఉస్మానియా వైద్యుడు మీడియాకు వెల్లడించారు. మరణానికి గల కారణాలను ఇప్పుడే తామేమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు.



ఇవీ చదవండి: