Junior colleges: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు మొదలు కాకపోయినా జులై ఒకటి నుంచి తరగతులు పునఃప్రారంభమైనట్లు.. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ కేలండర్ విడుదల చేయడం అందర్నీ అయోమయానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో బాలికల కోసం ఈ ఏడాది 434 జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. 292 ఉన్నత పాఠశాలలను ఉన్నతీకరించగా.. 128 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ తరగతులను ఏర్పాటు చేశారు. మరో 14 కో-ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలను ప్రత్యేక బాలికల కళాశాలలుగా మార్పు చేశారు. 292 ఉన్నత పాఠశాలల ఉన్నతీకరణకు ఈ నెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు కళాశాలలకు అధ్యాపకులను కేటాయించలేదు. ప్రవేశాల ప్రక్రియపై స్పష్టత లేదు.
ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణలో మిగిలే స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి లెక్చరర్లుగా నియమించాలని భావించినా ఇది పూర్తి కాలేదు. అకడమిక్ కేలండర్‌లో మాత్రం జులై 1నుంచి 220 రోజులు కళాశాలలు పని చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికీ తరగతులు ప్రారంభం కాని, కళాశాలల్లో 220 పనిదినాలు ఎలా వస్తాయి? పాఠాలు చెప్పేందుకు లెక్చరర్లు లేకుండా తరగతులు ఎలా కొనసాగుతాయో అధికారులకే తెలియాలి.
మరో 45 రోజుల్లో త్రైమాసిక పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈ పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పదోతరగతి చదివిన వారికి టీసీలు ఇవ్వకుండా అదే పాఠశాలలో ఇంటర్‌లో చేరాలని ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తున్నారు. లెక్చరర్లు లేనందున పిల్లలు ముందుకు రావడం లేదు. రెండేళ్లపాటు ప్రవేశాలు తక్కువగా ఉంటే ఈ కళాశాలలను రద్దు చేస్తారు. అలాంటప్పుడు ఇంత హడావుడిగా ఎందుకు ప్రారంభిస్తున్నారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చూడండి: