గ్రామీణ రహదారుల పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం.. పల్లెలకు శాపంగా మారింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)లో రాష్ట్రానికి కొత్త కేటాయింపుల్లో కేంద్రం భారీగా కోత విధించింది. 2021-22లో కేవలం 24.58 కిలోమీటర్ల రోడ్ల పనులు మాత్రమే మంజూరు చేసింది. 2022-23లో తెలంగాణ, బిహార్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు రహదారుల పనులు మంజూరు చేసిన కేంద్రం మనకు ఒక్కటీ ఇవ్వలేదు. సాక్షాత్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఇటీవల రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. పీఎంజీఎస్‌వైలో రోడ్ల పనులకు కేంద్రం 60% నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చాలి. కేంద్రం నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వాటిని విడుదల చేయకపోవడం, తన వాటా సొమ్ము వెంటనే సమకూర్చకపోవడంతో పనుల నిర్వహణ కష్టమవుతోంది. రాష్ట్రంలో గ్రామీణ రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే సుమారు రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు.
భారీ కేటాయింపులతో మొదలై..
పీఎంజీఎస్‌వై-3లో 2019-20 నుంచి 2023-24 మధ్య అయిదేళ్లలో రాష్ట్రంలో 3,285 కి.మీ. గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. 2019-20లో 935 కి.మీ.పనులు మంజూరు చేసింది.ఇందులో 300.52 కి.మీ. పనులే పూర్తయ్యాయి. 2020-21లో మంజూరు చేసిన 1,378 కి.మీ.కు గాను 530.79 కి.మీ.ల పనులే పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో పనుల్లో జాప్యమవుతోంది. పీఎంజీఎస్‌వై పెండింగ్ బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు కొన్నాళ్ల క్రితం విజయవాడలోని ఈఎన్‌సీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ పరిణామాలన్నీ గమనించిన కేంద్రం రెండేళ్లుగా పనుల మంజూరులో భారీగా కోత విధించింది.
బీఆర్ ఇచ్చినా నిధుల జమ జాప్యమే
పీఎంజీఎస్‌వై పనులకు 60% నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎప్పటికప్పుడు కేటాయిస్తోంది. రాష్ట్ర ఖజానాకు జమయ్యే ఈ నిధులకు రాష్ట్ర వాటా 40% జోడించి విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2022-23కు పీఎంజీఎస్‌వైలో తొలి విడతగా కేంద్రం రూ.122 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.80 కోట్లు కలిపి రూ.202 కోట్లకు ఆర్థికశాఖ బడ్జెట్ రిలీజ్ (బీఆర్) ఆర్డర్ ఇచ్చింది. కానీ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ బ్యాంకు ఖాతాకు మాత్రం నిధులు జమ కాలేదు.
మూడేళ్లలో 68.74 శాతమే పూర్తి
పీఎంజీఎస్‌వై-3తోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రాష్ట్రానికి కేటాయించిన రహదారుల పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. గత మూడేళ్లలో మంజూరైన పనుల్లో ఇప్పటి వరకు 68.74 శాతమే పూర్తయ్యాయి.
ఇదీ చూడండి : ఆమె "నెల్లూరు సినతల్లి" : చంద్రబాబు