నివర్ తుపాను ముప్పు తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్‌పైనా ఉండనున్నట్లు తాజా అంచనాలు హెచ్చరిస్తున్నాయి. బుధవారం తీవ్ర తుపానుగా తీరం దాటాక... అదేరోజు అదే తీవ్రతతో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు భారత వాతావరణ విభాగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ జిల్లా మీదుగా వెళుతుండగానే అది వాయుగుండంగా బలహీనపడే అవకాశాలున్నాయి. సోమవారం రాత్రి వరకున్న సమాచారం ప్రకారం.. పుదుచ్చేరిలోని కరైకల్, మామల్లపురం(మహాబలిపురం) మధ్య తీరం దాటేప్పుడు గంటకు 100 కి.మీ నుంచి 120 కి.మీ దాకా గాలులు వీచే అవకాశముంది. చిత్తూరు జిల్లాలోకి కూడా దాదాపు ఇదే తీవ్రతతో రావొచ్చని అంటున్నారు. గురువారం వరకూ ఇదే జిల్లా మీదుగా ఇది కొనసాగనుంది. బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన వాయుగుండం సాయంత్రానికి తీవ్ర వాయుగుండమైంది. ఇది మంగళవారానికి తుపానుగా మారి, తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సోమవారం సాయంత్రానికి ఈ తీవ్రవాయుగుండం తమిళనాడు, పుదుచ్చేరి దిశగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఆ సమయానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450కి.మీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 480కి.మీ దూరంలో ఉన్నట్లు వెల్లడించారు.
తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంద్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అత్యంత భారీవర్షాలు ఈనెల 24న తమిళనాడు, పుదుచ్చేరిలోని పుదుకొట్టాయ్, తంజావూరు, తిరువారూర్, కరైకల్, నాగపట్టిణం, కడలూర్, అరియలూర్, పెరబలు జిల్లాల్లో ఉంటాయని అంచనా.
- 25న కడలూర్, కల్లకుర్చి, పుదుచ్చేరి, విల్లుపురం, తిరువణ్ణమలై, చెంగల్‌పట్టు, అరియలూర్, పెరంబలూర్, కరైకల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుంటాయని అంచనా.
- ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈనెల 25, 26వ తేదీల్లో అత్యంతభారీ వర్షాలుంటాయని వెల్లడించారు. ఇదే తీవ్రత తెలంగాణ జిల్లాల్లో 26న ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీరంమీదుగా గాలుల ప్రభావం మొదలైనట్లు విశాఖ తుపానుహెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం చురుగ్గా ఉండటంతో.. వేటకు వెళ్లొద్దని మత్స్యకారుల్ని హెచ్చరించడంతో పాటు విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నంలో మొదటి ప్రమాదహెచ్చరిక ఎగురవేసినట్లు వెల్లడించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భయం... భయం
నివర్ తుపాను కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలతో రైతుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతం వరి, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, ఉద్యాన తదితర పంటల అన్నదాతలు అల్లాడుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఖరీఫ్ పంటలు 38,12,577 ఎకరాల్లో, రబీ పంటలు 9,60,747 ఎకరాల విస్తీర్ణంలో వివిధ దశల్లో ఉన్నాయి. ఆయా పంటల నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. తీవ్ర తుపాను హెచ్చరికలతో వివిధ శాఖల అధికారుల అప్రమత్తంగా ఉండాలని.. విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.
కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష
నివర్ హెచ్చరికల నేపథ్యంలో జాతీయ సంక్షోభ నివారణ కమిటీ (నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ) ఛైర్మన్ హోదాలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గాబా సోమవారం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీలంసాహ్ని, కె.షణ్ముగం, అశ్వినీకుమార్‌లతో వీడియో సమావేశం నిర్వహించి, అప్రమత్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌మాల్య సైతం విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్‌ఎంలతో సోమవారం వీడియో సమావేశం నిర్వహించారు. రైళ్ల రాకపోకలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: