ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ ముమ్మాటికీ ఆయన అసమర్థతను, చేతగానితనాన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై నెట్టడానికేనని తెదేపా శాసనసభపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. వ్యాక్సిన్లతో ప్రజల ప్రాణాలు కాపాడకుండా, కమీషన్ల కోసం ముఖ్యమంత్రి పాకులాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉత్తుత్తి లేఖలు, నోటిమాటలతో ప్రజలు ప్రాణాలు నిలవవని ముఖ్యమంత్రి గ్రహించాలని హితవు పలికారు. కమీషన్లు రానప్పుడు వ్యాక్సిన్లు కొనడమెందుకనే ముఖ్యమంత్రి ఆర్డర్లు పెట్టలేదని ఆరోపించారు.
తయారీ సంస్థల నుంచి నేరుగా రాష్ట్రాలే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి, ప్రజలకు ఇవ్వాలని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొనుగోలులో పోటీపడితే, ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించడంలో పోటీపడ్డారని మండిపడ్డారు. తీరా పరిస్థితి చేయి దాటిపోయాక ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్లు ఇవ్వడం నేరమంటున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యాక్సిన్ల కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే విదేశీ కంపెనీలను సంప్రదించి, గ్లోబల్ టెండర్లను తక్షణమే అమలు జరపాలని సూచించారు. వ్యాక్సిన్లు సకాలంలో కొనకుండా ప్రజలు ప్రాణాలు పోయేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి తక్షణమే తన తప్పు ఒప్పుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'