మొన్న కరోనా, తర్వాత హంటా. నిన్న జీ-4, నేడు బుబోనిక్ ప్లేగ్.. ఇలాంటి భయంకర వ్యాధుల హెచ్చరికల్లో నిత్యం వార్తల్లో నిలుస్తోంది... చైనా. ఇప్పటికే కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం అల్లకల్లోలంగా అవుతోంది. అది మరువక ముందే జీ-4 అనే కరోనాను మించిన వైరస్ తమ దేశంలో ఉన్నట్లు ఇటీవలే ప్రకటించి మానవాళికి మరో కంగారు పెట్టే వార్త చెప్పారు చైనా పరిశోధకులు. ఇప్పుడు మరోసారి కరోనా, జీ-4ను మించిన మహమ్మారి మరొకటి తమ దేశంలోకి వచ్చిందని చెప్పి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది చైనా. అందుకే ప్రపంచం మరోసారి చైనావైపు భయంభయంగా చూస్తోంది.
కరోనా కంటే ప్రమాదం..!
ప్రస్తుతం చైనాలో బుబోనిక్ ప్లేగ్ కరోనా కన్నా ప్రమాదకర సంకేతాలు పంపిస్తోంది. ఆ దేశాన్ని వణికిస్తోంది కొత్త మహమ్మారి. ఇది కరోనాను తలదన్నేలా ఉంటుందంటున్నారు పరిశోధకులు. చైనాకు ఉత్తర సరిహద్దులో ఉన్న ఇన్నర్ మంగోలియాలో బుబోనిక్ ప్లేగ్ తొలుత వెలుగుచూసింది. ఇది సోకిన వ్యక్తిని బయన్ నూర్ సిటీ డాక్టర్లు గుర్తించారు. వెంటనే ఆ వ్యక్తి కుటుంబం, సన్నిహితులు, చుట్టుపక్కల వారందరిని ఐసోలేట్ చేశారు. వాళ్లందరికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ముందస్తుగా స్థానికులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఈ ఏడాది చివరి వరకు ఆ హెచ్చరికలు అమల్లో ఉంటాయన్నారు.
ఇప్పటికే వ్యాపించి ఉండవచ్చు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే, బుబోనిక్ ప్లేగ్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈపాటికే బయన్ నూర్ సిటీలో చాలామందికి బుబోనిక్ ప్లేగ్ వ్యాపించే ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. అసలు అది ఎప్పుడు మొదలైందో, ఎంతమందిలో ఉందో వంటి వివరాలను చైనా ప్రభుత్వం బయటకు రానివ్వడంలేదు. ప్రస్తుతం చైనా పొరుగు దేశమైన మంగోలియాలోను బుబోనిక్ ప్లేగ్ వేగంగా వ్యాపిస్తోంది. దీని లక్షణాలు.. జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింప్ గ్రంధుల్లో నొప్పి, శరీరంపై పుండ్లు. వ్యాధి సోకిన వ్యక్తికి సరైన వైద్యం అందించకపోతే, 24 గంటల్లోనే చనిపోతాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఇది అత్యంత ప్రమాదకరమైనది
ప్లేగు 3రకాలు. వాటిలో ప్రమాదకరమైన రకం బుబోనిక్. ఈ ఇన్ఫెక్షన్లకు ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణం. ఇది ఎలుకలు, గుమ్మడి పురుగులను వాహకాలుగా చేసుకుంటుంది. వాటిని తిన్నప్పుడు బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలగ జేస్తుంది. బుబోనిక్ ప్లేగ్ వైరస్ కూడా ఎలుకల మాంసం తినడం వల్లే మనుషులకు వచ్చిందని వైద్యులు భావిస్తున్నారు. మర్మోట్ జాతికి చెందిన ఎలుకల మాంసం తిన్న ఇద్దరికి ముందుగా ఈ వ్యాధి సోకిందని స్థానికి మీడియా జులై 1న తెలిపింది. ఎలుకలు తినడం చైనీయుల అలవాటు. అదే బుబోనిక్ ప్లేగ్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం కావచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాణం పోవటమే... మరో మార్గం లేదు
కొద్దిరోజుల కిందటే జీ4 అనే మరో వైరస్‌ను కూడా డాక్టర్లు గుర్తించారు. జీ4 హెచ్1ఎన్1 వైరస్ ఇప్పుడిప్పుడే చైనాలో వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ సోకిందంటే ప్రాణం పోవడం తప్ప మరో మార్గం లేదని... ఈ కొత్త వైరస్ ప్రభావం షాండాంగ్, హుబేయ్ ప్రావిన్సుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ పందులపెంపకం పరిశ్రమల్లో పనిచేసే వారిలో కొంతమంది దీని బారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం జంతువుల నుంచి మనుషులకు మాత్రమే సోకిన ఈ వైరస్ చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. కరోనా తరహాలోనే ఈ వైరస్ కూడా మహమ్మారిలా వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. 2009లో ప్రపంచాన్ని కుదిపేసిన హెచ్1ఎన్1 నుంచి జీ4గా మారుజాతిగా అభివృద్ధి చెందినట్లు గుర్తించారు.
ఇలా గుర్తించారు
2011 నుంచి 2018 వరకు పరిశోధకులు 10 చైనా ప్రావిన్సుల్లోని పశువైద్య ఆసుపత్రుల్లోని పందుల కళేబరాల నుంచి 30వేల నమూనాలు తీసుకుని 179 స్వైన్ ఫ్లూ కారక వైరస్‌లను గుర్తిం చారు. వాటిలో కొత్తరకం వైరస్‌లే ఎక్కువ. ఇవన్నీమనుషులకు సోకే అవకాశం ఎక్కువగా ఉందని, వాటిపై విస్తృతంగా పరిశోధనలు జరపాల్సి ఉంటుందని తేల్చారు. సాధారణంగా పందుల్లో సంక్రమించే వైరస్ మనుషులకు సోకుతుంటుందని, అదే తరహాలో జీ4 కూడా చాలా సులభంగా మనుషులకు సంక్రమిస్తుందని చెబుతున్నారు. ఐతే మనుషుల నుంచి మనుషులకు సోకడం అంత సులభం కాదంటున్నారు. ఒకవేళ కరోనాలానే మనుషుల నుంచి మనుషులకు సోకిందంటే అది మానవ జాతి మనుగడకే సవాల్ కావొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇది అంత సులువు కాదు
వాస్తవానికి... 2009లో వెలుగులోకి వచ్చిన స్వైన్ ఫ్లూ అందరూ అనుకున్నంత ప్రమాదకరం కాలేదు. ఎందుకంటే అది అంతకు ముందు బయటపడిన చాలా వైరస్‌ల లాంటిదే. అందుకే ప్రజల్లో కూడా స్వైన్ ఫ్లూ వైరస్‌తో పోరాడగలిగే సామర్థ్యం ఏర్పడింది. చైనాలో గుర్తించిన ఫ్లూ వైరస్ 2009లో బయటపడిన స్వైన్ ఫ్లూ లాంటిదే. కానీ ఇది కొన్ని కొత్త మార్పులతో మళ్లీ బయటపడింది. జీ4 వైరస్ మనుషుల శ్వాసనాళంలో పెరుగుతుందని, తన సంఖ్య వృద్ధి చేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భయందోళనలు ఎక్కువయ్యాయి.
ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు లేఖ
జీ-4 ఇది సోకిన వారిని ప్రస్తుతం ఉన్న ఫ్లూ వాక్సిన్ కాపాడలేదు. ప్రపంచంలోనే చైనా లోనే పందుల సంఖ్య అత్యధికం. అందుకే అక్కడ పందుల్లో, వాటి ఆస్పత్రుల్లో పనిచేసేవారిలో ఈ వైరస్‌ను గుర్తించడానికి తక్షణం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఒక లేఖ రాశారు. కొత్త రోగాలకు కారణమయ్యే వైరస్‌ల ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుందనే విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది. అడవి జంతువులతో పోలిస్తే, మనుషులకు దగ్గరగా ఉండే పెంపుడు జంతువులు ఈ వైరస్‌లకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనాలో జంతువులకు చాలా దగ్గరగా జీవిస్తుంటారు ప్రజలు.
ఇవి స్వరూపం మార్చుకోగలవు
ఈ వైరస్ తన స్వరూపం మార్చుకోగలదంటున్న శాస్త్రవేత్తల అభిప్రాయాలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి అన్ని దేశాలకు. ఎన్ని కొత్త వైరస్ లు దాడి చేస్తున్నా చైనా తీరు మారడం లేదనే అసహనం వ్యక్తమవుతోంది. మరో మహమ్మారిగా మారే ప్రమాదకర వైరస్‌లు పుట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చైనాకే పరిమితమైన ఈ వైరస్‌లు మున్మందు విజృంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే కరోనాతో యుద్ధం చేస్తున్న ప్రపంచ దేశాలను జీ4, బుబోనిక్ ప్లేగ్ మరింత వణికిస్తున్నాయి. ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే చైనాతో కొంతకాలం ప్రపంచ దేశాలు సంబంధాలు తెంచుకుంటేనే మంచిదనే ప్రచారం ఊపందుకుంటోంది.
ఇదీ చదవండి: కరోనా సంక్షోభానికి డెంగీ తోడైతే.. ఇక అంతే!