ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణ పనుల పర్యవేక్షణకు కొత్త వ్యవస్థను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం వైద్య విద్య సంచాలకుల ఆధ్వర్యంలో బోధనాసుపత్రుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తామంది. ఇవి కాకుండా గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు, కడపలో క్యాన్సర్ ఆస్పత్రి, మానసిక ఆరోగ్య వైద్య సంస్థను ఏర్పాటుచేయనున్నారు. వీటి కోసం 12వేల కోట్ల రూపాయలు వరకు ఖర్చవుతుందని అంచనా. రానున్న మూడేళ్లలో వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గుజరాత్, రాజస్థాన్ తరహాలో
వీటి కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు వీలుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నట్లు ప్రత్యేకంగా నోడల్ సొసైటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థ పరిధిలోకి ప్రస్తుత వైద్య కళాశాలలు, ఆసుపత్రుల ఆస్తులను బదిలీ చేస్తారు. వైద్య కళాశాలల అభివృద్ధికి అవసరమైన చర్యలను ఈ సొసైటీ తీసుకునేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధుల సమీకరణ, పర్యవేక్షణ పనుల కోసం రెండు కమిటీలను ప్రతిపాదించారు.
ఇదీ చదవండి: యాప్లో నమోదు చేస్తే..ఎక్కడికి వెళ్లాలో చెబుతారు