పరిశ్రమలకు నీటి సరఫరాను పర్యవేక్షించటానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ)కు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. ప్రభుత్వం, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలతో పరిశ్రమల నీటి సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను సంస్థ అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలోని జలాశయాల్లో ఉన్న నీటిలో 10 శాతం పరిశ్రమల అవసరాలకు వినియోగించుకోవటానికి ప్రభుత్వం అనుమతించింది. దీని ప్రకారం సుమారు 106 టీఎంసీల నీరు పరిశ్రమల కోసం అందుబాటులోకి వస్తుంది. దీనికోసం పారిశ్రామిక పార్కుల్లో ప్రత్యేక రిజర్వాయర్లు, పైపులైన్లు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. వీటికి సుమారు రూ.2 వేల కోట్లు అవసరమని భావిస్తున్నారు.
ఈ మొత్తాన్ని ప్రభుత్వం, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలుగా సంస్థ సేకరిస్తుంది. పరిశ్రమలకు సరఫరా చేసిన నీటికి లెక్కలు రూపొందించి.. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం లీటరుకు రూ.1.50 వంతున సెస్సు రూపేణా సంస్థ వసూలు చేస్తుంది. ఇలా ఏటా సుమారు రూ.700 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం నుంచి పాలనా వ్యయం, రుణాలు తిరిగి చెల్లిస్తుంది. సంస్థ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డు నిధులకు సంబంధించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా అభివృద్ధి పనులను ప్రతిపాదించే వెసులుబాటు కలుగుతుంది.
'ప్రస్తుతం నీటి సరఫరాకు సంబంధించి కచ్చితమైన లెక్కలు లేవు. సెస్సు వసూళ్లు కూడా పక్కాగా లేవు. దీనికితోడు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే వరకు వేచి చూడాలి. సంస్థ ఏర్పాటు తర్వాత ప్రాథమికంగా కార్యకలాపాలు ప్రారంభించటానికి ప్రభుత్వం కొంత మొత్తాన్ని అందిస్తుంది' అని ఒక అధికారి తెలిపారు.
ఇదీ చదవండి:
యాస్ తుపానుపై అధికారులు అప్రమత్తం కావాలి: మంత్రి వెల్లంపల్లి