రాష్ట్రంలో అమృత్ సరోవర్ కార్యక్రమ లక్ష్యంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పథకంలో గత 30 రోజుల్లో పనులు పూర్తయిన చెరువులు, పనులు చేయకపోయినా ఇటీవల వర్షాలకు నీరు చేరిన చెరువుల ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో అధికారులు అప్‌లోడ్ చేసి పూర్తి చేశామనిపిస్తున్నారు. దీంతో అమృత్ సరోవర్‌లో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు అత్యధికంగా చెరువులు అభివృద్ధి చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,177 చెరువులను గుర్తించారు. వీటిలో ప్రారంభించిన 1,866 పనుల్లో 245 చోట్ల పూర్తయినట్లు నరేగా వెబ్‌సైట్‌లో అధికారులు అప్‌లోడ్ చేశారు.
జిల్లాకు 75 చెరువులను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం
‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. వీటిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం దేశంలోని ప్రతి జిల్లాలో 75 చొప్పున చెరువులను అభివృద్ధి చేయాలనేది ఒకటి. ఎకరా స్థలంలో 10 వేల క్యూబిక్ మీటర్లలో నీరు నిలిచేలా ఒక్కో చెరువు పనులు చేపట్టాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు గత నెలలో సూచించింది. వీటిని ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని పేర్కొంది. ఆగస్టు 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అభివృద్ధి చేసిన చెరువులను ప్రధాని ప్రారంభించనున్నారు.
మళ్లించాక... ఇంకా నిధులెక్కడివి?
అమృత్ సరోవర్‌లో కొత్త చెరువుల నిర్మాణం, ఉన్నవి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు వినియోగించుకునే వెసులుబాటు కల్పించినా రాష్ట్రంలో నిధులను మళ్లించడంతో అలాంటి అవకాశమే లేకపోయింది. 15వ ఆర్థిక సంఘం నిధులతోనూ చెరువులు అభివృద్ధి చేయొచ్చని కేంద్రం సూచించింది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 2021-22లో తొలి విడత నిధుల్లో నుంచి దాదాపు రూ.300 కోట్లు పంచాయతీ విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. 2021-22లో రెండో విడత, 2022-23లో తొలి విడత నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. దీంతో పలు జిల్లాల్లో ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాదిలో ఇప్పటికే పూడికలు తొలగించిన, గట్లు పటిష్ఠం చేసిన..., ఇప్పటికీ పనులు చేస్తున్న చెరువులను గుర్తించి అమృత్ సరోవర్‌లో చేసినట్లుగా అధికారులు చూపిస్తున్నారు.
అలాగే చాలా జిల్లాల్లో ఇటీవల వర్షాలకు చెరువుల్లో నీరు చేరింది. అందువల్ల వీటి అభివృద్ధికి ప్రత్యేకంగా పనులు చేపట్టే అవకాశం లేదు. నరేగాలో పనులు చేయని కొన్ని చెరువులను కూడా అమృత్ సరోవర్ జాబితాలో చేరుస్తున్నారు. వీటిలో వర్షపు నీరు చేరినందున విచారణకు ఆదేశించినా ఎలాంటి ఇబ్బందీ ఉండదనే ఇలా చేసినట్లు సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో అదే జరిగింది. వర్షాలకు నీరు చేరిన చెరువులను గుర్తించి వీటిలో పనులు చేసినట్లుగా చూపించారు.