విశాఖలో ఎల్జీ పరిశ్రమలోని ట్యాంకుల నుంచి మళ్లీ గ్యాస్ వెలువడకుండా చర్యలు తీసుకున్నట్లు సీఎస్ నీలం సాహ్ని కేంద్ర కేబినెట్ కమిటీకి వివరించారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ రెండో రోజూ సమీక్ష జరిపింది. ఈ సమీక్షలో సీఎస్ నీలంసాహ్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడి పరిస్థితిని వివరించారు. ఘటన జరిగిన అనంతరం బాధితులకు అందించిన వైద్యసదుపాయాలు, ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చేసిన ఏర్పాట్లను ఆమె వివరించారు.
ఈ సందర్భంగా పరిశ్రమల భద్రతకు సంబంధించి అంతర్జాతీయ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన కమిటీ... తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కెమికల్స్ పంపేందుకు సిద్ధమని కేంద్ర కమిటీ హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్డీఆర్ఎఫ్ డీజీ, ఎయిమ్స్ డైరెక్టర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి..