అమరావతి పర్యటనలో చంద్రబాబుపై చెప్పులతో, రాళ్ళతో జగన్ దాడి చేయిస్తే... అది భావప్రకటన స్వేఛ్ఛగా కనిపించిన పోలీసులకు... వైకాపా చెత్త పాలన చూసి కడుపు మండి ఒక మహిళ మాట్లాడితే... అది చట్ట వ్యతిరేక చర్యగా కనిపించడం ఆశ్చర్యంగా ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. పద్మజ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఒక్క వైకాపా మంత్రులు, నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందా అని నిలదీశారు. మంత్రులు బూతులు తిట్టినా, దుర్భాషలాడినా అది పోలీసులకు పవిత్రమైన భావప్రకటనా స్వేచ్ఛలా కనిపిస్తుందా..? అని ప్రశ్నించారు. ఎప్పటికీ వైకాపానే అధికారంలో ఉండిపోతుందనుకోవడం అవివేకమని హితవు పలికారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ... వైకాపా చేస్తున్న ప్రతీచర్య భవిష్యత్తులో వారి మెడకు చుట్టుకోవడం ఖాయమని హెచ్చరించారు.
ఇదీ చదవండి : 'దాడులను సహించం.. కార్యకర్తలను కాపాడుకుంటాం'