వైకాపా నేతలపై తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు చోటుచేసుకున్నాయని జగన్ చేస్తున్నదంతా అసత్య ప్రచారమే అని స్వయంగా కేంద్రమంత్రే చెప్పారని వెల్లడించారు. ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవన్నా... వదలకుండా పీపీఏలను రద్దు చేయాలని వైకాపా నేతలు పదేపదే లేఖలతో వెళ్లి కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు. జగన్ కు ఇంత ఆరాటం ఎందుకు అని ప్రశ్నించిన ఆయన... పాత పీపీఏలను రద్దుచేసి తన సొంత పవర్ ప్రాజెక్టులకు లాభం తెచ్చేలా కొత్త ఒప్పందాలు చేసుకోవాలనే కదా అని నిలదీశారు.
స్వార్థంతో పెట్టుబడులు రాకుండా....
తన స్వార్థం కోసం రాష్ట్రానికి, దేశానికి పెట్టుబడులు రాకుండా ముఖ్యమంత్రి చేయటమేంటని లోకేశ్ మండిపడ్డారు. అవినీతిని చంద్రబాబుకి అంటగట్టాలని చూస్తే జగన్ నీఛత్వం బయటపడుతూనే ఉంటుందని దుయ్యబట్టారు. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా హితవు పలికారు.
ఇవీ చూడండి