రాజధాని నిర్మాణం కోసం తమ భూమి అందించి త్యాగం చేసిన అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయటం తగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కౌలు బకాయిలు తక్షణమే విడుదల చేయటంతో పాటు రైతులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఎంఆర్డీఏ కమిషనర్ కు లేఖ రాశారు.
"రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి సాగు సామర్థ్యం ఆధారంగా వారికి రూ. 30వేల నుంచి రూ. లక్ష వరకూ చట్టపరంగా కౌలు చెల్లించాల్సి ఉంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం పూర్వికుల నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని రైతులు త్యాగం చేశారనే విషయాన్ని మరువకూడదు. ప్రతి ఏటా మే నెలలో వీరికి కౌలు చెల్లించాల్సి ఉండగా.. కరోనా మొదటి దశలో గత ఏడాది నెలరోజులకు పైగా ఆలస్యం చేశారు. కరోనా రెండో దశలో ఈ ఏడాది కూడా కౌలు ఇంత వరకూ చెల్లించకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. భూమి ఇచ్చిన రైతుల్లో అధిక శాతం హెక్టారు కంటే తక్కువ ఉన్న చిన్నకారు రైతులే. వారంతా వార్షిక కౌలు పైనే ఆధారపడి ఉన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతున్నందున ఆలస్యం చేయకుండా రైతులకు చెల్లింపులు చేయాలి. సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవటం వల్ల దేశంలో 23 కోట్ల మంది.. కరోనా ప్రభావంతో పేదలుగా మారారని అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం తాజా నివేదిక వెల్లడిస్తోంది. కరోనా సోకిన రైతు కుటుంబాలు ఆర్థికంగా కృంగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 2014 డిసెంబర్ నాటికి అమరావతి ప్రాంతంలో స్థిరపడిన వారందరికీ ఉచిత వైద్యసేవలు అందించే దిశగా గత ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆరోగ్య కార్డులూ జారీ చేసింది. ఈ కార్డుల ఆధారంగా అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి వెంటనే సమస్యను పరిష్కరించాలి. కరోనా సంక్షోభంలో రాజధాని రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు అంతా కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది." - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఇవీ చదవండి:
'కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉంది'
InterNational Flights: 'రేపటి నుంచి వందేభారత్ మిషన్ విదేశీ సర్వీసులు ప్రారంభం '