Nagoba Jatara 2022: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలతో జాతర ప్రారంభమైంది. సుమారు గంటపాటు మెస్రం వంశీయుల సమక్షంలో పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం మర్రిచెట్టు నీడన మెస్రం వంశీయులు సేదదీరారు.
ఈ సందర్భంగా భక్తులపై మెస్రం వంశస్తులు పవిత్ర జలాలను చల్లారు. అంతకుముందు నాగోబా విగ్రహాన్ని నాయక్‌వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి తీసుకువచ్చారు. మెస్రం వంశం ఆడపడుచులు ఆలయ ఆవరణలో మట్టితో పుట్టలు తయారు చేశారు. మహాపూజకు ఎమ్మెల్యేలు రేఖానాయక్, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత అత్యంత ప్రజాధరణ పొందిన గిరిజనుల జాతరగా పేరొందిన ఈ జాతర ఐదురోజుల పాటు కొనసాగనుంది. ఈనెల 3న మండగాజిలి పూజ, 4న ఖేతాల్ పూజ నిర్వహించనున్నారు.
నాగోబా జాతర కథేంటి?
ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం పూర్వం మెస్రం వంశీయుల్లో ఏడుగురు అన్నదమ్ములు కేస్లాపూర్‌లోని మేనమామ ఇంటికి వస్తారు. కష్టాల్లో ఉన్నా సాయం చేయలేదనే కోపంతో తన తండ్రిని చంపడానికి వస్తున్నారని భావించిన కూతురు ఇంద్రాదేవి పెద్దపులిగా మారి ఏడుగురి అన్నదమ్ముల్లో ఆరుగురిని హతమారుస్తుంది. చివరివాడు నాగేంద్రుడిని వేడుకోవడంతో ప్రాణాలతో బయటపడి కేస్లాపూర్ చేరుకుంటాడు. తనను కాపాడిన నాగేంద్రుడిని తమ గ్రామంలోనే కొలువుతీరాలని కోరుకోగా.. అక్కడ వెలసిన దేవతనే కేస్లాపూర్ నాగోబాగా ప్రసిద్ధి పొందింది.
ఇదీచూడండి: Ratha Sapthami at Tirumala : తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు -తితిదే
జాతర ప్రత్యేకతలేంటి..
కాలిక చెప్పుల్లేకుండా.. మెస్రం వంశీయులు నాగుపాముల్లా వంకలు తిరుగుతూ అడవి మార్గంలో తరలివెళ్తారు. జాతరలో భాగంగా గంగాజలం తీసుకురావడానికి ఇలా వెళ్తారు. తమతో పాటు చెట్టూ, పుట్ట, చేను పశుపక్షాదులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జాతరకు శ్రీకారం చుడతారు. ఆత్మీయంగా పలకరించుకుంటూ ఏడాది పాటు ఎదురైన కష్టాలన్నీ మరిచి అమ్మవారి సన్నిధిలో ఆనందంగా గడుపుతారు. నియమ, నిష్టలను ప్రాణప్రదంగా భావించే మెస్రం వంశీయుల నాగోబా జాతరను ఘనంగా జరుపుకుంటారు.
మెస్రం వంశీయుల జీవనానికి నిలువుటద్దం...
నాగోబా జాతర మెస్రం వంశీయుల జీవన విధానం.. వారి ఆచార వ్యవహారాలకు ఇదో నిలువుటద్దం. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవాళ్లైనా తరలివస్తారు. కొందరు ఎడ్లబళ్లపై చేరుకుంటారు. ప్రతిఏటా పుష్యమి శుక్లపక్షమి రోజున గంగాజలం కోసం 15 రోజుల పాటు కాలినడక సాగిస్తారు. గోదావరి జలాల సేకరణకు మంచిర్యాల జిల్లా జన్నారం వెళ్తారు. అక్కడ పవిత్ర గంగా జలాన్ని కడవల్లో నింపుకొని కేస్లాపూర్‌కు చేరుకుంటారు. పుష్యమి అమావాస్య రోజున అర్ధరాత్రి నాగదేవతను అభిషేకించి జాతర ప్రారంభిస్తారు.
ఇదీచూడండి: ఇక్కడకొచ్చిన వారికి పుణ్యం పురుషార్థం దక్కాలనే: త్రిదండి చినజీయర్ స్వామి
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!